Pawan Kalyan- Vangaveeti Mohana Ranga: ఏపీలో ఉన్నకుల రాజకీయాలు మరెక్కడా ఉండవు. తెలుగునాట కులానికి ఇచ్చే ప్రాధాన్యత మరెక్కడా ఉండదు. అటు సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీలో సైతం కుల జాఢ్యం ఎక్కువ. కానీ ఆ పార్టీ రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యం మేరే ఇతర కులానికి లభించలేదు. అటు టీడీపీ ఆవిర్భావంతో కమ్మలకు రాజ్యాధికారం చాన్స్ దక్కింది. అయితే కుల రాజకీయలకు బలైన సామాజికవర్గం, బాధిత సామాజికవర్గం మాత్రం కాపు అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఇటువంటి తరుణంలో పార్టీకి జవసత్వాలు నింపి తిరిగి అధికారంలోకి తెచ్చింది మాత్రం వంగవీటి మోహన్ రంగా హత్య ఘటన.

విజయవాడలో మాస్ లీడర్ గా ఎదిగి బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహన్ రంగా హత్యకు గురైన వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అటు కాపులతో పాటు బడుగు బలహీనవర్గాల వారికి ఆయన ఓ ఆశాదీపంగా మారిపోయారు. అటువంటి వ్యక్తి హత్య అనంతరం లాభపడింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అప్పటికే రెండు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ గద్దె దిగేందుకు ముమ్మాటికీ కారణం కూడా రంగా హత్యే. అయితే బాధిత కాపు సామాజికవర్గానికి మాత్రం న్యాయం జరగలేదు. లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తన పాత వాసనలతో తిరిగి రెడ్డి సామాజికవర్గం వారికే సీఎం పీఠం, పార్టీ పగ్గాలు అందించింది. నాడు కాపులకు సారధ్య బాధ్యతలు అప్పగించి ఉంటే ఆ సామాజికవర్గానికి న్యాయం చేసిన పార్టీగా కాంగ్రెస్ కీర్తించబడేది. నాడు ఆ పనిచేసి ఉంటే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ హీన పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఇప్పటికీ విశ్లేషకులు భావిస్తుంటారు.
అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రంగా పాత్రను పవన్ కళ్యాణ్ గుర్తుచేస్తున్నారు. చేతిలో ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. ఎంపీలు సైతం లేరు. వెనుక పేరు మోసిన నాయకులు లేరు. అయినా లక్షాది మంది అభిమానం సొంతం చేసుకున్నారు పవన్. ఇదే ఆయనకు గుర్తింపు తెచ్చింది. ఒక దేశ ప్రధానిగా మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి జగన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అది వైసీపీ కార్యక్రమం అన్న రేంజ్ లో జన సమీకరణ చేస్తోంది. అయితే అనూహ్యంగా ప్రధాని పవన్ ను పిలిచి మాట్లాడడం ఏమిటి? అన్న చర్చ అయితే ప్రారంభమైంది. సహజంగా దేశాధినేతలు, కేంద్ర పాలకులు దురదృష్టితో వ్యవహరిస్తారు. పవన్ ను దూరదృష్టితో చూసే దూరం చేసుకోలేక.. మరింత దగ్గరవుతున్నట్టు సంకేతాలిస్తున్నారు.

నాడు రంగా బతికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పటికే కాపు ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అటు బడుగు బలహీనవర్గాలు సైతం రెడ్డి, కమ్మ సామాజికవర్గ వారి ఆధిపత్యాన్ని సహించలేక మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. రంగా వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఒక లీడర్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురయ్యారు. సరిగ్గా అక్కడకు రెండు దశాబ్దాల తరువాత పవన్ రంగా రూపంలో కాపులకు, బడుగు, బలహీనవర్గాలకు దర్శనమిస్తున్నారు.దానిని అందిపుచ్చుకునే స్టేజ్ లో పవన్ కూడా ఉన్నారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో రంగా మాదిరిగా పవన్ విశ్వరూపం ప్రదర్శించే అవకాశాలైతే ఉన్నాయి. రంగా అనే ఎపిసోడ్ ను కొనసాగించేందుకు కాపులు, బడుగు బలహీనవర్గాలకు పవన్ రూపంలో ఒక చాన్స్ దొరికిందన్న మాట.