Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: పాపం లోకేశం.. ఈసారైనా మంగళగిరిలో గెలుస్తాడా?

Nara Lokesh: పాపం లోకేశం.. ఈసారైనా మంగళగిరిలో గెలుస్తాడా?

Nara Lokesh: చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినంత సులభం కాదు రాజకీయాల్లో రాణించడం.. ప్రజలను ఆకట్టుకోవాలి. ప్రజలను అర్థం చేసుకోవాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని.. పరిష్కార బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి. అప్పుడే ఒక రాజకీయ నాయకుడు రాణించగలుగుతాడు. ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలుగుతాడు. నాన్న ముఖ్యమంత్రి అయినంత మాత్రాన.. ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలు కాలేరు.. నారా లోకేష్ ఉదంతమే ఇందుకు ఒక బలమైన ఉదాహరణ. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనను ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత ఐటీ, పురపాలక శాఖలకు ఆయనను మంత్రిగా నియమించారు. అప్పటిదాకా నారా లోకేష్ కు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి మంత్రిని చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక కొంతకాలానికి అంటే 2019లో ఏపీలో ఎన్నికలు వచ్చాయి.. ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేశారు. వైసిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. చివరికి తన తండ్రి ఏ ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే ఇచ్చారో.. అదే నారా లోకేష్ కు మిగిలింది.

మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. 21 రోజుల్లో నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారని సొంత పార్టీ నాయకులే విమర్శించడం మొదలుపెట్టారు. అంతేకాదు స్థానిక ప్రజలతో మమేకం కాకుండా విజయం ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. అయితే అప్పట్లో అధిష్టానం ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకుంది. లోకేష్ అభ్యర్థిత్వం సరైనదనే విధంగా వ్యాఖ్యలు చేసింది. తీరా ఇన్ని రోజుల తర్వాత తన అభ్యర్థిత్వం తప్పని, ఎన్నికల్లో అలా చేసి ఉండాల్సింది కాదని స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు. అంతేకాదు తాను చేసిన తప్పులు ఏమిటో ఆయన ప్రజల ముందు ఒప్పుకున్నారు.

అయితే ప్రస్తుతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని జగన్ నేరుగా చెప్పేశారు. ఆయన స్థానంలో ఒక బీసీ నాయకుడికి టికెట్ దాదాపు ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ నాయకుడు గతంలో టిడిపిలో పనిచేయడం.. ప్రజలతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండడంతో ఆయనకు జగన్ టికెట్ ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ బీసీ నాయకుడికి టికెట్ ఓకే అయితే లోకేష్ గెలుపు కష్టమే అని వైసిపి నాయకులు అంటున్నారు. గతంలో అదే బీసీ నాయకుడు టిడిపిలో కీలకంగా పని చేశారని.. 2019 ఎన్నికల్లో లోకేష్ కు బదులు ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా గెలిచేవారని అంటున్నారు. అయితే ప్రస్తుతం లోకేష్ కూడా మంగళగిరిలో విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. అనేక రకాలుగా తనను హేళన చేశారని.. వారందరికీ సమాధానం చెప్పాలంటే తాను కచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో గెలవాలని లోకేష్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గత ఐదు సంవత్సరాలుగా అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సంబంధం బాంధవ్యాలను పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్కడి ప్రజల సమస్యలపై ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ లోకేష్ ను తొలిసారి ఎమ్మెల్యేను చేస్తాయా? లేక 2019 నాటి ఫలితాన్నే అందిస్తాయా? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version