పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ పదవీ గండం పొంచి ఉందా? ఆమె సీఎం సీటు నుంచి దిగిపోయే అవకాశం ఉందా? అంటే.. సంకేతాలు అదేవిధంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ.. మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ లో పోటీచేసిన ఆమె.. సమీప ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు.
అయినప్పటికీ.. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ సీఎం కావొచ్చు. కానీ.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి విజయం సాధించాల్సి ఉంది. అలా కాని పక్షంలో ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిగ్గా రద్దైపోతుంది. ఇదే ఇప్పుడు మమతా పదవికి ఎసరు తెచ్చేలా ఉందనే చర్చలు సాగుతున్నాయి.
తాజాగా.. ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ ఇదే కారణంతో రాజీనామా చేశారు. ఆయన కూడా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన తీరత్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సెప్టెంబర్ 5 లోగా ఆయన గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మరో ఆరు నెలల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నికల్లో జరగబోతున్నాయి. ఆర్నెల్లలోపు ఉప ఎన్నికలు నిర్వహించడం కుదరదు. ఈ కారణంగానే.. ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు.
అయితే.. మమత విషయానికి వచ్చే సరికి కరోనా అడ్డుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ విజృంభించడానికి ఎన్నికల నిర్వహణే కారణమనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఇప్పుడు ఈసీ ఉప ఎన్నిక నిర్వహిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పైగా థర్డ్ వేవ్ కూడా ఉందనే ప్రచారం నేపథ్యంలో దాదాపుగా ఉప ఎన్నిక ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. అదే జరిగితే.. మమత పదవీచ్యుతురాలు కావడం ఖాయమే. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి. ప్రస్తుతానికైతే.. భవానీనగర్ నియోజకవర్గం మమత కోసం ఖాళీగా ఉంది. ఆమె సొంత నియోజకవర్గం అదే. గత ఎన్నికల్లోనే సువేందును ఓడించేందుకు నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు.