Will Jr.NTR participate in active politics : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ వెబ్ పోర్టల్స్.. జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. ప్రముఖ హిందీ మీడియా అయిన బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ క్రియాశీల రాజకీయాల సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. నటుడిగా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. మీ భవిష్యత్తు ఇప్పటి నుంచి పదేళ్లు లేదా ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అందుకే నా తదుపరి ప్రతి సెకను విలువైనది అని నమ్మే వ్యక్తిని. కాబట్టి నేను ప్రస్తుతానికి ఆనందంగా జీవిస్తున్నాను. నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను. నటుడిగా నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పని ఇది. ప్రస్తుతానికి ఈ క్షణానికే కట్టుబడి ఉంటాను’ అని జర్నలిస్ట్ ప్రశ్నకు తారక్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Hari Hara Veera Mallu: తన చారిత్రక చిత్రానికి డేట్లు ఇచ్చిన పవన్ !
ఎన్టీఆర్ కు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ అతడు ప్రస్తుతం దృష్టి అంతా సినిమాలపైనే ఉందని అతడి మాటలను బట్టి తెలుస్తోంది. ఏపీ తెలుగుదేశం దీనావస్థలో ఉంది. దాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు లేవని ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టాడు. అయినప్పటికీ అవకాశాలను తోసిపుచ్చలేదు.
వచ్చే పదేళ్లపాటు సినిమాలపైనే దృష్టి సారిస్తానని, అప్పటి వరకూ చూస్తానని ఎన్టీఆర్ ‘పదేళ్ల’ టార్గెట్ మాత్రమే పెట్టడం గమనార్హం. ఎందుకంటే చంద్రబాబు వయసు ఇప్పుడు 70 ఏళ్లు. ఇంకో పదేళ్లు దాటితే వృద్ధుడై పార్టీ ఆగమైపోతుంది. ఆయన వారసుడు లోకేష్ శక్తి సామర్థ్యాల గురించి అందరికీ తెలిసిందే. సో పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ అడుగులు రాజకీయాలపై పడొచ్చని తాజా ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది.
నిజానికి టీడీపీలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ పార్టీని పునరుద్ధరించగలరని నమ్ముతున్నారు. అయితే స్పష్టమైన కారణాల వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారన్న అభిప్రాయం ఒకరిద్దరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇది తారక్‌ని, టీడీపీని ఇంకెన్నాళ్లు వెంటాడుతుందో చూడాలి.
Also Read: Vijay Devarakonda: అతను కొడితే విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ !