Prashant Kishor miscalculate: ప్రశాంత్ కిశోర్.. అలియాస్ పీకే.. దేశమంతటికీ తెలిసన పేరు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితం.. తెలంగాణలో ఒకసారి కేసీఆర్ పార్టీని, ఏపీలో వైఎస్ జగన్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన పీకే.. తన సొంత రాష్ట్రం బిహార్‌లో రెండేళ్ల క్రితం జన్‌సురాజ్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అన్ని పార్టీల గెలుపోటములను నిర్దేశించే పీకే.. తన పార్టీ గెలుపు ఓటములను మాత్రం అంచనా వేయడంలో విఫలమైనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో గెలిస్తే 150 సీట్లు వస్తాయి… ఓడితే 10 సీట్లు వస్తాయని పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.
ఎన్నికలకు వారం ముందు కీలక వ్యాఖ్యలు..
బిహార్‌లో తొలి విడత ఎన్నికలు నవంబర్ 6న జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండగా, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి. ఆయన తాజా ఇంటర్వ్యూలో ‘‘మా పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రజలు తిరస్కరిస్తే 10కి పరిమితం కావొచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ స్పష్టత ఆయన ధీమా, అలాగే వాస్తవ స్పృహను సూచించింది.
‘ప్రజల విశ్వాసమే కీలకం’..
ఎన్నికలలో తాను ఎన్ని సీట్లు గెలుస్తారని అంచనా వేస్తున్నారని ప్రశ్నించగా, కిశోర్ సమాధానం రాజకీయ వ్యూహకర్తగా చెప్పారు. ‘‘జనసామాన్యుడు దీర్ఘకాల రాజకీయ నిరాశలో ఉన్నాడు. కొత్త ప్రత్యామ్నాయం గుర్తించడానికి విశ్వాసం అవసరం. జన్సురాజ్ ప్రజలలో అంచెలంచెలుగా నమ్మకం పెంచుకుంటోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన స్వీయ పోటీపై మాట్లాడుతూ, ‘‘నేనేం ఎక్స్ ఫ్యాక్టర్ కాదు. కర్గాహర్ నుంచి పోటీ చేస్తానని చెప్పిను తప్ప, ఇంకా తేల్చలేదు’’ అని వ్యాఖ్యానించారు.
మూడో ప్రత్యామ్నాయం అవుతుందా..?
బిహార్‌లో దశాబ్దాలుగా మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి), ఎన్‌డీయే (బీజేపీ ఆధ్వర్యం) కూటముల మధ్యే అధికారం మారుతోంది. కానీ కిశోర్ మాటల్లో ‘‘ఇప్పటికే బిహార్ ఓటర్ల మూడవ వంతు ఈ రెండు కూటములను ఇష్టపడడం లేదు’’ అని తెలిపారు. ఆయన అంచనా ప్రకారం, 160–170 నియోజకవర్గాలలో జన్‌జురాజ్ బలమైన పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక పీకే పొత్తుల అంశంపై గట్టి వైఖరిలో ఉన్నారు. ‘‘ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోం. ప్రజలు మాకు పూర్తి మద్దతు ఇవ్వకపోయినా, మా పాదయాత్ర, సామాజిక చైతన్య కార్యక్రమాలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. అయితే ఒకవేళ అస్పష్ట ఫలితాలు వస్తే, నేతలు పార్టీలు మార్చే పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘అది వారి భయం, దౌర్భల్యం. నేను వారిని ఆపలేను’’ అని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది – నవంబర్ 6, 11 తేదీల్లో. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపడతారు. ఫలితాల తర్వాత బిహార్ రాజకీయ పటంలో జన్ సురాజ్ పార్టీ నిజంగా మూడో శక్తిగా ఎదుగుతుందా లేదా అన్నది నిర్ణయాత్మకం కానుంది. ఇదే ప్రశాంత్ కిశోర్‌కు నాయకుడిగా తొలి పెద్ద పరీక్ష.. ఓట్ల ద్వారా ప్రజలు ఆయన కొత్త రాజకీయ ప్రస్థానానికి దారిచూపుతారో లేదో చూడాలి.