D Srinivas : మాజీ టీపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధమైంది. సోనియాగాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోనియాగాంధీతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీఎస్ ను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే డీఎస్ రాకతో కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా? ఆయన వల్ల పార్టీకి ఏవైనా ప్రయోజనాలు పెరుగుతాయా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు మార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన వ్యూహాలు అప్పుడు పనిచేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తారా? ఆయన ఆలోచనలతో పార్టీ బలోపేతం అవుతుందా అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం దృష్ట్యా ఆయన పర్యటనలకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో డీఎస్ పార్టీలో చేరినా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పోయిన నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్రనాలు ప్రారంభించినట్లు సమాచారం.
దీంతో రాష్ర్ట కాంగ్రెస్ లో యువరక్తం అవసరం ఏర్పడింది. తలలు పండిన నేతలు ఉన్నా వారితో ఒనగూరే లాభం ఏమిటి? వారు ఎక్కడుంటే అక్కడే స్థిరంగా ఉంటారు. దీంతో ఎటూ కదలలేరు. అదే యువ నేతలైతే పాదరసంలా ఎప్పుడు తిరుగుతూ పార్టీకి లాభం చేకూర్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వృద్ధ నేతలకంటే యువ నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.