
తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే రేవంత్ రెడ్డికి పీసీసీ కిరీటం దక్కడం. ఇది కేవలం కాంగ్రెస్ కు సంబంధించిన అంశమే కాదు. అటు టీఆర్ఎస్, బీజేపీ కూడా ఆసక్తికరంగా గమనించిన విషయం. మొత్తానికి ఎన్నో అంశాలను పరిగణించి, మదించి చివరకు రేవంత్ కు పట్టం కట్టింది అధిష్టానం. మరి, ఈ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉంటుంది? అది తమపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అని కమలగులాబీలు చర్చించుకుంటున్నాయి.
2014 వరకు తెలంగాణలో బీజేపీ కౌంట్ లెస్ అని చెప్పాలి. 2018 ఎన్నికల నాడు కూడా బీజేపీని లెక్కలోకి తీసుకోలేదు టీఆర్ఎస్. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్ కు తాము ప్రత్యామ్నాయం అని చెప్పుకునే స్థాయికి కాషాయ నేతలు వచ్చేశారు. ఇదొక అనివార్యమైన పరిస్థితి అనే చెప్పాలి. అప్పటి వరకూ ఎదురుగా ఉన్న కాంగ్రెస్ ను లేవకుండా తొక్కేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. అనుకున్నది సాధించారు. కానీ.. ఆ స్థానాన్ని భర్తీ చేసేంత సీను బీజేపీకి ఉందనుకోలేదు. అయితే.. ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ.. వేగంగా వికసించింది కమలం.
కాంగ్రెస్ ను తొక్కేయడం.. బీజేపీకి ఆయాచితంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతగానీ.. కమలం బలం ఏపాటిదో అర్థం కాలేదు. అప్పుడుగానీ.. తాను చేసిన పొరపాటు కేసీఆర్ కు అర్థం కాలేదు! టీఆర్ఎస్ రాజకీయం ప్రశాంతంగా కొనసాగాలంటే.. కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలి. అదే సమయంలో తనను కాటేసేలా ఉండకూడదు.. అలాగని మన్నుతిన్న పాములా పండకూడదు. కానీ.. కేసీఆర్ కొట్టిన దెబ్బ చాలా బలంగా తగిలడంతో.. లేచే పరిస్థితే లేకుండాపోయింది. ఈ కారణంగానే బీజేపీ చేసిందే విమర్శగా మారిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామంగానే చెబుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దూకుడు కలిగిన నేతగా రేవంత్ రాణిస్తాడని పార్టీలోని చాలా మంది ఆశిస్తున్నారు కూడా. అయితే.. ఒకరకంగా కేసీఆర్ కు ఇది మంచి వార్తే కానీ.. మరీ అంత మంచి వార్త కాదు. బీజేపీ కన్నా కాంగ్రెస్ బలపడడమే కేసీఆర్ కోరుకుంటారు. కానీ.. వ్యక్తిగత ప్రత్యర్థిగా భావించే రేవంత్ సారథ్యంలో ఎదగడాన్ని ఆయన అంగీకరించరు.
అటు చూస్తేనేమో బీజేపీ దూసుకొస్తోంది. ఈటల చేరికతో మరో మెట్టు ఎక్కాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్ లో నెలకొన్న రాజకీయ పరిణామం తమకు ఏవిధంగా కలిసివస్తుందా? అని గులాబీ దళంలో ఓ చర్చ అయితే సాగుతోంది. మరి, దీనికి కాలం ఏం సమాధానం చెబుతుంది అన్నది చూడాలి. రేవంత్ ఆధ్వర్యంలో పార్టీ పూర్వ వైభవానికి వస్తుందా? అది బీజేపీని మళ్లీ వెనక్కు నెడుతుందా? లేదంటే.. గుర్రుగా ఉన్న సీనియర్ల కారణంగా.. మరింత పతనంవైపు పయనిస్తుందా? అన్నది చూడాలి.