నైరుతి రుతుపవనాలు మొదటగా తాకేది కేరళ తీరాన్నే. ఆ తర్వాతనే తొలకరి దేశాన్ని పలకరిస్తుంది. ఇది ప్రతీఏటా జరుగుతుంది. మరి.. కాషాయ పవనాలు కేరళను తాకేది ఎప్పుడు? అని సంఘ్, బీజేపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. బీజేపీ పుట్టిన కాడనుండీ చూస్తూనే ఉన్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆశగా కళ్లు పెద్దవి చేస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటి వరకు కమలం వికసించింది లేదక్కడ! కేరళ రాష్ట్ర చరిత్రలో ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీ తరపున శాసనసభలో అడుగు పెట్టారు. 2014 నుంచీ.. కాషాయ పవనాలు ఎన్నడూ లేనంతగా దేశవ్యాప్తమైనప్పటికీ కేరళ తీరాన్ని మాత్రం తాకలేకపోతున్నాయి. కారణమేంటీ అన్నదే ఆసక్తికరం!
దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్-కమ్యూనిస్టులు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నారు. అది కూడా వరుసగా ఛాన్స్ లేదు. ఒక దఫా వీరు గెలిస్తే.. మరో దఫా వారు గెలిచే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. మూడో రౌండ్ కూడా ఉండాలని, అది తమదే కావాలన్నది కమలనాథుల ఆశ, ఆశయం. దీనికోసం దశాబ్దాలుగా దండయాత్రలు సాగిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కానరావట్లేదు. చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతవుతుంటాయి బీజేపీ అభ్యర్థులవి! ఎట్టకేలకు 2016లో ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపగలిగారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఈ సారి కింగ్ కాలేకపోయినా.. కింగ్ మేకర్ అయినా కావాలని ఆశపడుతున్నారు కాషాయ నేతలు.
హౌస్ ఫుల్, కలెక్షన్ నిల్ అన్న చందంగా ఉంటుంది కేరళలో బీజేపీ పరిస్థితి. దేశంలోనే ఆర్ ఎస్ ఎస్ శాఖలు ఇక్కడ అత్యధికంగా ఉన్నాయి. కేరళలో 4,500 శాఖలు ఉండగా.. దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో సంఘ్ శాఖలు లేవు. అంతేకాదు.. గడిచిన 90 సంవత్సరాలుగా ఇక్కడ ఆరెస్సెస్ యాక్టివ్ గా ఉంది. అయినప్పటికీ.. ఒక్క అసెంబ్లీ సీటు గెలవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దీనికి కారణమేంటని ఆరాతీస్తే.. స్వయంగా బీజేపీ నేతలు చెబుతున్న సమాధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
‘‘ఇక్కడ చాలా కాలంగా కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. కేరళ ప్రజలు విద్యావంతులు. పొద్దున లేస్తే నాలుగైదు వార్తా పత్రికలు చదువుతారు. దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతోందో వాళ్లు తెలుసుకుంటారు. చదువురాని ప్రాంతాలకు చెందిన జనాల మాదిరిగా వాళ్లు గుడ్డిగా ఓట్లు వేయరు. వివేకంతో ఆలోచిస్తారు’’ ఇదీ.. స్వయంగా కేరళలో గెలిచిన ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ చెప్పిన సమాధానం!
ఆయన సమాధానాన్ని బట్టి.. కులం, మతాల పేరుతో రాజకీయం చేస్తే కేరళ ప్రజలు అంగీకరించరనే విషయం స్పష్టమవుతోంది. మాట్లాడే ప్రతీ మాట వెనకున్న అర్థమేంటో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కేవలం అభివృద్ధిని మాత్రమే ప్రాతిపదికగా ఎంచుకుంటారని అర్థమవుతోంది. కేరళలో బీజేపీ ఎదగకపోవడం కారణం ఇదేనని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా.. ఆ రాష్ట్రంలో 55శాతం హిందువులు ఉండగా.. 45 శాతం మైనారిటీలు ఉన్నారు. మైనారిటీలపై బీజేపీ వ్యవహార శైలి కూడా ఆ పార్టీకి వారిని దూరం చేసిందని అంటారు. ఇక, హిందువులుగా ఉన్నవారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలే చెప్పారు. ఇక్కడ హిందువులు మెజారిటీగా కమ్యూనిస్టుల పక్షాన్నే ఉన్నారని తెలుస్తోంది.
అయితే.. మోడీ హవా సాగుతున్న ఈ తరుణంలోనే కేరళలోనూ బలం పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆరెస్సెస్ కార్యకర్తలతో గట్టిగా కృషి చేస్తోంది. కాగా.. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యనే ప్రతీసారి పోరు. ఇప్పుడుకూడా అంతే. అయితే.. యూడీఎఫ్ లో ముస్లింల హవా కొనసాగుతోందని భావిస్తున్న క్రైస్తవుల్లో కొందరు బీజేపీ వైపు మళ్లారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, వారి సంఖ్య ఎంత? ఈ ఎన్నికల్లో బీజేపీ చూపబోయే ప్రభావం ఎంత అన్నది ప్రశ్న. ఫైనల్ గా.. ఈ సారైనా కాషాయ పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయా? కింగ్ మేకర్ కావాలని కలలు గంటున్న కాషాయ దళం ఆశలు ఫలిస్తాయా? అన్నది చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్