Kodali Nani vs Balakrishna: వైసీపీలో ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడడంలో ముందుంటారు. వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తారు. పదునైన మాటలతో విమర్శలు దాడి చేస్తుంటారు. అందుకే టిడిపి శ్రేణులు కొడాలి నానిని బద్ద విరోధిగా చూస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కోరుకుంటున్నారు. అయితే అంతకుమించి చంద్రబాబు సైతం కృత నిశ్చయంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమితో పాటు రాజకీయ సమాధి చేయాలని భావిస్తున్నారు.ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
మొన్నటి వరకు గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఇన్చార్జిగా ఉండేవారు. కొడాలి నాని దూకుడుకు రావి అడ్డుకట్ట వేయలేరని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్నారై వెనిగండ్ల రాముకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే రాము గుడివాడలో మంచి పనితీరు కనబరుస్తున్నారు. గ్రామాల చుట్టూ తిరుగుతూ టిడిపి అభివృద్ధికి పాటుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గట్టి పోటీ తప్పదని సంకేతాలు ఇస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. బాలకృష్ణ అయితే గట్టి ఫైట్ నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి గెలుపొందారు. 2004లో పోటీ చేసి గెలుపొందడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అక్కడ వైసీపీలో వర్గ విభేదాలతో పాటు ప్రభుత్వం పై వ్యతిరేకతతో భారీ మెజారిటీ సాధిస్తానని బాలకృష్ణ నమ్మకంగా ఉన్నారు. అయితే అటువంటి బాలకృష్ణ ఇప్పుడు సొంత నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి బరిలో దిగుతారని తెలుస్తుండటం కాస్త ఆసక్తికరంగా మారింది. కొడాలి నాని కి చెప్పాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బరిలో దిగితే మేలని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దివంగత తారకరత్న ఇక్కడ నుంచి పోటీ చేస్తారని తొలిత ప్రచారం జరిగింది. కానీ ఆయన అకాల మరణం చెందారు. ఇప్పుడు బాలకృష్ణ పేరు వినిపిస్తుండడం సర్వత్రా ఆసక్తి రేగింది. వెనిగండ్ల రాముకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని.. అటు రావి వెంకటేశ్వరరావుకు సైతం ఉన్నత స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని.. ఆ ఇద్దరు నేతల సహకారంతో గుడివాడ పై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని.. బాలకృష్ణ పోటీ చేయడం తధ్యమని వార్తలు వస్తున్నాయి.
అయితే బాలకృష్ణ హిందూపురం వీడితే అక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. లోకేష్ పేరు వినిపిస్తోంది. లేకుంటే చంద్రబాబు పోటీ చేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం తో పాటు హిందూపురంలో పోటీ చేస్తారని.. రెండు చోట్ల గెలుపొందుతారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల వైసిపి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని తరచూ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భయపడి అలా చేశారని వైసీపీకి ప్రచార అస్త్రం గా మారుతుంది. అయితే రెండు నియోజకవర్గ నుంచి బరిలో దిగి చంద్రబాబు విపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వరని కూడా టాక్ ఉంది. అటు మంగళగిరిని లోకేష్ విడిచిపెట్టినా ఎన్నికల వేళ ఇబ్బందిగా మారుతుంది. అందుకే బాలకృష్ణ హిందూపురం నుంచి కదిలించరని.. వెనిగండ్ల రాముతోనే కొడాలి నానిని ఓడించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని టిడిపిలో మెజారిటీ వర్గం చెబుతోంది. మరిఏం జరుగుతుందో చూడాలి.