
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సయాజీ హోటల్‌లో ఒక వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పెళ్ళికి హాజరైన విదేశీ అతిథులపై అడవి పంది దాడి చేసింది. పెళ్లి కుమారుని సోదరుడు అక్కడున్నవారిని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ పంది అతనిపై తిరగబడింది. తీవ్రంగా గాయపడిన ఆతను ఆసుపత్రి పాలయ్యాడు. భద్రతా ఏర్పాట్లలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే అడవి పంది హోటల్‌లోకి ప్రవేశించిందని అక్కడున్నవారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆస్ట్రియాకు చెందిన 13 మంది విదేశీ అతిథులతో సహా 16 మంది అక్కడ వున్నారు. భోపాల్‌లోని ప్రేమ్ పురా ఘాట్ వద్ద ఉన్న సయాజీ హోటల్‌లో ఈ వివాహం జరిగింది. అతిథులు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు హోటల్ ప్రాంగణంలోకి ఒక అడవి పంది వచ్చింది. దింతో గందరగోళం చెలరేగింది. అతిథులందరూ ప్రాణాలను కాపాడుకోడానికి పరుగెత్తటం ప్రారంభించారు.
ఇంతలో పెళ్లికుమార్తె సోదరుడు మయూర్ పవార్ అడవి జంతువును తరిమికొట్టడానికి ప్రయత్నించాడు. అయితే మయూర్ తనను తాను రక్షించుకోలేకపోయాడు. అడవి పంది మయూర్ కాలును తీవ్రంగా కొరికివేసింది . అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహ వేడుకకు తాము ఒక పెద్ద హోటల్‌ను బుక్ చేసి భారీ మొత్తాన్ని కూడా చెల్లించామని, తగినంత భద్రతా ఏర్పాట్లు చేయలేదని దేవేంద్ర పవార్ ఆరోపించారు.