
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన రాజకీయ సభ కు కోరానా వైరస్ బారిన పడిన వ్యక్తి వచ్చాడు. ఈ వార్త తెలిసిన వెంటనే వైట్ హౌస్ లో అలజడి మొదలైంది. అయితే ట్రంప్ తాను అలాంటివి పట్టించుకోనని తేల్చిచెప్పడం విచిత్రంగా మారింది. పైగా తన ప్రచార షెడ్యూల్ మునుపటిలా నడుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఒక ట్వీట్ లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ… సమావేశానికి ఒక కరోనా బాధితుడు వచ్చాడని చెప్పారు. సమావేశానికి ముందే, న్యూజెర్సీలోని ఒక ఆసుపత్రిలో అతనిని పరీక్షించారని, కరోనా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తిగా గుర్తించారన్నారు. ఇది తెలియడంతో అతనిని సాధారణ ప్రజల నుండి వేరు చేశారన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి వ్యక్తి న్యూజెర్సీలోని వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ప్రధాన ఆడిటోరియంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాలేదని వివరించారు.
అయితే ఈ కార్యక్రమంలో తాను కరోనా సోకిన వ్యక్తితో మాట్లాడానని సమావేశం చివరి రోజున ట్రంప్‌తో కూడా చేతులు కలిపానని యూనియన్ చైర్మన్ మాట్ ష్కాల్ప్ యుఎస్ ది వాషింగ్టన్ పోస్ట్ కు తెలిపారు. కాగా ఈ విషయం వెల్లడయ్యాక ట్రంప్… తాను ఈ విషయం గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదన్నారు. ఇక్కడ కరోనా వైరస్ ముప్పు ఉన్నప్పటికీ, తన ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.