Chandigarh Mayor election : కొన్నిసార్లు అనవసరమైన పట్టింపులకు పోకపోవడమే మంచిది. మొహమాటం కొద్దో.. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమనుకుంటారో అనే అభిప్రాయం వల్లో పట్టింపులకు పోయి పనులు చేస్తే అభాసు పాలు కావడం తథ్యం. ప్రస్తుతం బిజెపి ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నది. రామ మందిర నిర్మాణం.. రాముడి విగ్రహ ప్రతిష్ట.. ఇంకా అనేక సానుకూల పరిణామాలతో మూడోసారి కూడా అధికారంలోకి వస్తుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. బిజెపి ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవడం ముమ్మాటికి స్వయంకృతాపరాధమే. ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తలంటింది అంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలో అదును కోసం ఎదురుచూస్తున్న ఆప్, ఇతర పార్టీలు బిజెపిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. అంతేకాదు దొడ్డి దారిన గెలుస్తూ ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహస్యం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే??
చండీగడ్.. పంజాబ్ రాష్ట్ర రాజధాని. ఢిల్లీ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది. సాధారణంగా చూసుకుంటే అది ఒక కార్పొరేషన్. దాదాపు తెలంగాణలో వరంగల్ నగర పాలకం అంత ఉంటుంది. గత నెల చండీగడ్ నగర పాలకానికి సంబంధించి మేయర్ ఎన్నికకు ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియకు రిటర్నింగ్ అధికారిగా అనిల్ మాసి వ్యవహరించారు. మొత్తం చండీగడ్ నగరపాలకంలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆప్, కాంగ్రెస్ కూటమికి 20 మంది కౌన్సిలర్ల బలం ఉంది. వాస్తవానికి ఆ కూటమిదే విజయం అని అందరూ భావించారు. అని ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గుర్తులు సరిగా లేకపోవడంతో ఆప్_ కాంగ్రెస్ కూటమికి చెందిన 8 ఓట్లు తెల్లవాని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలో ఆ కూటమికి చెందిన మేయర్ అభ్యర్థి కులదీప్ సింగ్ కు 12 ఓట్లు, బిజెపి అభ్యర్థి మనోజ్ సోంకర్ కు 16 ఓట్లు వచ్చాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. బిజెపి అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారు. దీంతో కమలం పార్టీకి సంబంధించిన వారు సంబరాలు చేసుకున్నారు. సహజంగానే ఈ ఎన్నిక ఆప్, కాంగ్రెస్ కూటమిలో ఆగ్రహాన్ని కలిగించింది. రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరుతో వారు విసిగి వేసారి పోయారు. దీంతో ఆ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్_ ఆప్ కూటమి నాయకులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆప్ కౌన్సిలర్ కులదీప్ సింగ్ తొలుత పంజాబ్_ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కోర్టు నుంచి తిరస్కరణ ఎదురు కావడంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ చండీగడ్ మేయర్ ఎన్నికకు సంబంధించి అక్రమాలు జరిగాయని అభియోగాలు మోపుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్, జస్టిస్ జేబీ పార్డీ వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.చండీగడ్ మేయర్ ఎన్నికకు సంబంధించి 8 ఓట్లు రద్దు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరు సరిగా లేదని దుయ్యబట్టింది. అంతేకాదు బ్యాలెట్ పేపర్లలో ఆయన మార్పులు చేర్పులు చేసినట్టు కనిపించిందని అభిప్రాయపడింది. రిటర్నింగ్ అధికారిని విచారణ నిర్వహించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొన్నది. బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను ఆయన ఉద్దేశపూర్వకంగా చేరిపివేసినట్టు ధర్మాసనం గుర్తించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఎట్టి పరిస్థితిలో సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగడ్ మేయర్ ఎన్నికకు సంబంధించి మొత్తం రికార్డులు, బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీ, ఆధారాలు మొత్తం అందజేయాలని పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆప్_ కాంగ్రెస్ కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో అయినా బిజెపి నాయకులు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.