Telangana BJP: ఎంతలో ఎంత తేడా. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రేసులో ముందున్న పార్టీ.. తడబాటుకు గురవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అంత విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నేతలు మొత్తం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. సాధారణంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లో పరిస్థితులు చక్కబడుతుంటే.. తెలంగాణ బిజెపిలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని మించిన అవ లక్షణాలతో నేతలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మరోవైపు నేతలు ఏమాత్రం లైన్ దాటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కఠిన చర్యలు తీసుకునే బిజెపి అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.
వాస్తవానికి బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడైన తర్వాత భారతీయ జనతా పార్టీలో దూకుడు పెరిగింది. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా అధికార భారత రాష్ట్ర సమితికి చుక్కలు చూపించింది. ఏకంగా అధికార భారత రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని నిరూపించుకుంది. జనం కూడా విశ్వసించే స్థాయిలో కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ప్రభుత్వం లీజుకు ఇచ్చే వ్యవహారంపై బీజేపీ చేపట్టిన ఆందోళనలు అన్ని ఇన్ని కావు. మరి అంతటి భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మారుస్తారంటూ కొంతమంది నేతలు మీడియా ప్రతినిధులకు లీకులు ఇవ్వడంతో మొదలైన ఈ వ్యవహారం రోజురోజుకు ముదిరిపోతుంది. ఏకంగా అంతర్గత సంక్షోభం వరకు దారి తీసింది. ఎన్నికల వరకు బండి సంజయ్ ని అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న అభిప్రాయాలు ఉన్న దశలో అనూహ్యంగా అధ్యక్ష పదవి మార్పు తెరపైకి వచ్చింది. సంజయ్ పనితీరు నచ్చని కొందరు నేతలకు పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన నేతలు జత కలిశారు. దీంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒకానొక దశలో బండి సంజయ్ కి, ఈటల రాజేందర్ కు మధ్య విభేదాలు వచ్చాయి అనే ప్రచారం కూడా జరిగింది. అసమ్మతి వర్గం ఢిల్లీకి వెళ్లి మరీ సంజయ్ ని మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టింది. అంతే కాదు సంజయ్ ని మారుస్తున్నారు అంటూ కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు లీకులు ఇవ్వడం మొదలుపెట్టారు. మరికొందరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిని మార్చే ఆలోచన లేదని ఏకంగా అధిష్టానం ప్రకటించినప్పటికీ ఆ ప్రచారం ఇంకా ఆగడం లేదు. ఇక ఇటీవల బిజెపి చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకత్వాన్ని కలిశారు. తమను పిలిస్తేనే వెళ్లామని, ఎవరిపై కూడా తమ ఫిర్యాదు చేయలేదని వారు చెప్పినప్పటికీ.. బండి సంజయ్ ని లక్ష్యంగా చేసుకొని వారు ఫిర్యాదులు చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఇంతటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఎటువంటి మాట కూడా మాట్లాడకపోవడం ఇక్కడ విశేషం. ఇక దీనికి తోడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి చేసిన ఒక ట్వీట్ మరింత వివాదాస్పదమైంది. దీనికి ఈటల రాజేందర్ కౌంటర్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అధ్యక్ష మార్పు మళ్ళీ తెరపైకి వచ్చింది.
ఇక సోమవారం ఒక్కరోజే రాష్ట్ర బీజేపీలో పలు రకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధిష్టానం పిలుపుమేరకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కి వెళ్లి భేటీ అయ్యారు. అయితే ఈటల రాజేందర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని జితేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇస్తే తాను స్వాగతిస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించి, కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని ఢిల్లీ నుంచి వార్తలు వచ్చాయి. ఒకవైపు ఈ ప్రచారం సాగుతుండగానే మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పై ఆరోపణలు చేయడం విశేషం. తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని రఘునందన్ రావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజాసింగ్ పై సస్పెన్షన్ కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పార్టీలో ఒక గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో కమలం పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్రంలో ఓటమి ఎదురైంది. ఇక్కడ కూడా నేతల మధ్య అనైక్యత ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. మరి కర్ణాటక పరాజయం తర్వాత కూడా బీజేపీ నాయకులు వ్యవహార శైలి మార్చుకోకపోవడం కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తోంది.