ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించే బండి సజ్జల. ఆయన చెబతితే ఎంత పని అయినా క్షణాల్లో అయిపోతోంది. అధినేత కనుసన్నల్లో ఆయన మెలగడంతోనే ఈ స్థాయి వచ్చింది. ఎవరిని అంతగా చేరదీయని జగన్ సజ్జల విషయంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అత్యున్నత అధికారి నుంచి అటెండర్ వరకు ఆయన చెప్పిన విధంగానే ప్రవర్తిస్తారు. మరి ఆయన స్థానం అట్లాంటిది. ప్రభుత్వంలో ఏ నిర్ణయం ప్రకటించాలన్నా ఆయనే పెద్ద దిక్కు. ఆయనను అడగనిదే ఏ నిర్ణయమూ వెలువడదు. ఆయనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
పరిపాలనలో కీలక శాఖల నిర్ణయాలు సైతం ఆయనే తీసుకుంటారు. హోం శాఖ నుంచి కింది స్థాయి శాఖల వరకు ఆయనే బాస్. ఆయన చెప్పిందే వేదం. సర్కారు అనే బండి నడవాలంటే సజ్జల అనే ఇంధనం కావాల్సిందే. గతంలో పరీక్షల రద్దు విషయం గురించి మాట్లాడాలని విద్యాశాఖ మంత్రి సురేష్ ను పిలిపించారు. అప్పటికి ఆయనకు కూడా పరీక్షల రద్దు విషయం తెలియనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో సజ్జల కనుస్నల్లోనే మొత్తం పాలన నడుస్తోందన్నది నిర్వివాదాంశం.
కొందరు మంత్రులు ఉన్నా వారు కేవలం బూతులు తిట్టడానికే. ఎవరినైనా టార్గెట్ చేసి దూషణలు చేయాలంటే వారికే బాధ్యతలు అప్పగిస్తారు. కానీ పరిపాలనలో అన్ని విభాగాలను తన చేతిలో పెట్టుకున్న వ్యక్తి సజ్జల. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వాలన్నా, ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించాలన్నాసజ్జల ఉండాల్సిందే. ఆయన మార్గదర్శకత్వంలోనే పనులు జరగాల్సిందే. లేకపోతే దానికి అర్థం ఉండదు.
సజ్జల వ్యవహారం ఇప్పటికే పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండి కూడా అత్యంత కీలక విషయాల్లో సజ్జల జోక్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సజ్జల ఎందుకు తెర మీదకు వస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గతంలో వైఎస్ కు కేవీపీ ఆత్మలా ఉండేవారు. కానీ కీలక విషయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకునే వారు కాదు. కానీ సజ్జల మాత్రం చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏఫీలో ఇప్పటికే సజ్జల వ్యవహారంలో సీనియర్లు సైతం కినుక వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో మమ్మల్నికాదని ఆయనకు ఎలా పట్టం కడతారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పార్టీకి విధేయులుగా ఉంటున్నా పరిపాలన వ్యవహారాల్లో మమ్మల్ని పట్టించుకోకపోవడం ఏమిటని అంటున్నారు. తాము సైతం పరిపాలనలో అన్ని చూసుకునే సత్తా ఉందని చెబుతున్నారు. అధినేత జగన్ మా వైపు దృష్టి సారించాలని కోరుతున్నారు.