Pranab Mukherjee: నేపాల్ దేశాన్ని భారతదేశంలో భాగం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందా? దీనిని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఎందుకు తిరస్కరించారు? దాని వెనుక ఉన్న కారణాలేంటి? భారత మాజీ రాష్ట్రపతి, దివంగత కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ రాసిన the presidential years పుస్తకంలో పేర్కొన్న సంచలన వివరాలేంటి? దీనిపై ప్రత్యేక కథనం..
ప్రణబ్ ముఖర్జీ రాసిన the presidential years పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అప్పటి భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎదుటకు నేపాల్( హిమాలయ దేశాన్ని) ను భారత దేశంలో విలీనం చేయాలని ఆ దేశ రాజు త్రిభువన్ బీర్ బిక్రమ్ షా ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిని నెహ్రూ తిరస్కరించారు.. ఈ విషయాన్ని my prime ministers; different styles; different temperaments అనే శీర్షికతో ప్రణబ్ ముఖర్జీ సంచలన విషయాలు వెల్లడించారు. 11వ అధ్యాయంలో మనదేశంలోని ప్రధాన మంత్రులు, ఇతర నాయకుల వ్యవహార శైలి గురించి ఆయన ప్రస్తావించారు. ” ప్రతి ప్రధానమంత్రి కి పని విషయంలో ఒక శైలి ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ కంటే చాలా భిన్నంగా పనిచేసేవారు. వారిద్దరూ ఒకే పార్టీ నుంచి వచ్చినప్పటికీ.. విదేశీ విధానంపై, దేశభద్రత, అంతర్గత పరిపాలన వంటి వాటిపై భిన్నాభిప్రాయాలను కలిగి ఉండేవారని” ప్రణబ్ ముఖర్జీ రాశారు. ” నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేపాల్ తో దౌత్య పరంగా జాగ్రత్తగా వ్యవహరించారు. ఎందుకంటే రాణా పరిపాలన కాలంలో నేపాల్ లో రాజరికం ఉండేది. ఆ పరిస్థితులను గమనించిన నెహ్రూ నేపాల్ దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన వర్ధిల్లాలని కోరుకున్నాడు. ఇదే విషయాన్ని నేపాల్ రాజు త్రిభువన్ బీర్ బిక్రమ్ షా కు సూచించాడు. నేపాల్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలి.. ఎట్టి పరిస్థితుల్లో భారత దేశంలో విలీనం కావద్దని నెహ్రూ బీర్ బిక్రమ్ షా కు సూచించాడని” ప్రణబ్ ముఖర్జీ తన రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు.
ఒకవేళ నెహ్రూ స్థానంలో ఇందిరా గాంధీ ఉండి ఉంటే.. సిక్కిం రాష్ట్రాన్ని చేజిక్కించుకున్నట్టే.. నేపాల్ దేశాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసేదని ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో పేర్కొన్నాడు..” ఒకవేళ ఇందిరా గాంధీ ఆ సమయంలో ప్రధాన మంత్రిగా ఉండి ఉంటే చాలా విభిన్నమైన మార్పులను ఈ దేశం చవి చూసేదని” ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో వ్యాఖ్యానించాడు.. అంతేకాదు ఇదే పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. ” పెద్ద నోట్ల రద్దు పై నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో నాతో చర్చించలేదు. ఈ విషయాన్ని నేను ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. అయితే ఇలాంటి విషయంలో ప్రధానమంత్రి ఆలా తొందరపడి ఉండకూడదు.. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఈ నిర్ణయం ద్వారా నెరవేరలేదు. ఒక విషయం వైరుధ్యానికి భయపడకుండా చెప్పొచ్చు. ప్రభుత్వం చెప్పినట్టుగా నోట్ల రద్దు నిర్ణయం బహుళ లక్ష్యాలను నెరవేర్చలేదు. నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదు. నల్ల ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను స్తంభింప చేయలేదు. నగదు రహిత సమాజాన్ని మాత్రం సులభతరం చేసింది. అయితే ఇది నల్లధనాన్ని కట్టడి చేయలేదని” ప్రణబ్ ముఖర్జీ the presidential years పుస్తకంలో పేర్కొన్నాడు.