ఏపీలో ఇప్పుడు సంక్షేమం తప్ప.. అభివృద్ధి మాట వినిపించడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు నెలకొకటి చొప్పున సంక్షేమ పథకాలను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ.. అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రశ్నించే వారు ఎవరూ లేకపోవడంతో జగన్ కూడా తన పని తాను కానిచ్చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి మీద నోరు మెదపడం లేదు.
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా మొన్నటి వరకు అసలు రాష్ట్రంలోనే లేడు. హైదరాబాద్‌లో ఉండి జూమ్ మీటింగులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి పరిస్థితులపై స్పందించడంలో చంద్రబాబు విఫలమవుతున్నారని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఇప్పుడు చర్చంతా జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు మళ్లింది.
Also Read: వంగవీటి రాధాను అందుకే లైట్ తీసుకుంటున్నారా..?
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో దేశం దృష్టి ఏపీపై పడింది. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది తమ అభిప్రాయాలను చెప్పారు కానీ టీడీపీ మాత్రం మౌనంగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంత పెద్ద అంశం మీద స్పందించడం లేదు. ఏపీలో పవన్ జాడ అస్సలు కనిపించడం లేదని ఇప్పటికే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదో అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా ఒక లేఖ విడుదల చేయడం లేదంటే ఒక వీడియో ద్వారా మాట్లాడటం తప్పితే పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు.
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో చక్కర్లు కొట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల తర్వాత కూడా ఏపీలో బాగానే పర్యటించారు. ముఖ్యంగా సుగాలి ప్రీతికి న్యాయం విషయంలో పవన్ కళ్యాణ్ పోరాడారు. ఇక కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో జనసేనాని కూడా ఇంటికే పరిమితం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు కూడా హైదరాబాదులోని తమ ఇంటికే పరిమితం అయినప్పటికీ ఒకటి రెండు సార్లు అమరావతిలో కనిపించారు. కానీ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా ఏపీలో అడుగుపెట్టలేదు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి క్రమంగా పెద్ద తలకాయలు పక్క పార్టీల వైపు చూస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పటికీ ఇవేమీ కార్యకర్తల్లో జోష్ నింపడం లేదు.
Also Read: జగన్ తీవ్ర ఆరోపణ: చంద్రబాబు మౌనం వెనుక కారణమేంటి..?
మార్చి నుంచి ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్… సినిమా షూటింగులకు అనుమతి లభించాక కూడా ఎలాంటి సినిమా చిత్రీకరణలో పాల్గొనలేదు. తాజాగా మరో రీమేక్ సినిమా చేసే యోచనలో పవర్ స్టార్ ఉన్నట్లు సమాచారం. ఆ సినిమా షూటింగ్ కోసం పొలాచ్చి వెళుతున్నట్లు సమాచారం. అక్కడే నెలరోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. అయితే ఇది వచ్చే ఏడాది ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా ఘటన జరిగితే బలంగా ప్రశ్నించే పవన్ గొంతు విని దాదాపుగా ఏడెనిమిది నెలలైంది. అప్పుడప్పుడు ట్విటర్ పై స్పందించినప్పటికీ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడితేనే ఎఫెక్ట్ ఉంటుందని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. ఒకప్పుడు మళ్లీ సినిమాల జోలికి పోనంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు పార్టీ కంటే సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఏపీలో ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనలు తమ వాయిస్‌ను బలంగా వినిపించకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది.