
ఏప్రిల్ 1నుంచి ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అందువల్ల దానికి ముందుగానే ప్రభుత్వాలు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతాయి. ఉంటే మిగులు.. లేకుంటే లోటు చూపించి.. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయబోతున్నారు.. దానికి ఆదాయాన్ని ఎలా సమీకరిస్తారు? అన్నది అసెంబ్లీకి తెలిపి, ఆమోదించుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. కానీ.. ఏపీ సర్కారు బడ్జెట్ సమావేశాల ఊసే ఎత్తడం లేదు.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి చాలా రోజులైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ.. ఏపీ బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు. రాబోయే మూడు నెలల ఖర్చులకోసం అంటూ ఆర్డినెన్స్ రూపొందించి, గవర్నర్ ఆమోదానికి పంపింది జగన్ సర్కారు. అసలు, బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీతో ఆమోదించుకోకుండా.. ఆర్డినెన్స్ పెట్టి గవర్నర్ ద్వారా నిధుల ఖర్చుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతోంది.
గతేడాది కూడా ఏపీ సర్కారు ఇలాగే చేసింది. అయితే.. అప్పుడు కరోనా ఉంది కాబట్టి అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. ఇప్పుడు ఏమైందన్నది ప్రశ్న. కేంద్రం పార్లమెంట్ సమావేశాలు, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పెట్టుకొని బడ్జెట్ ను ఆమోదింపజేసుకున్నాయ. అలాంటప్పుడు ఏపీ సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నది అర్థం కావట్లేదు.
అయితే.. దీనికి ఒకే కారణం కనిపిస్తోందని అంటున్నారు. అవసరాలకు మించి ఏపీ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే.. ఆ లెక్కలన్నీ బడ్జెట్ లో చూపించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ బయటకు రావొద్దనే ఉద్దేశంతోనే ఏపీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే.. ఆర్డినెన్స్ పాస్ చేయించి, గవర్నర్ ఆమోద ముద్ర ద్వారా బండి లాంగించాలని చూస్తోందని అంటున్నారు.