Pawankalyan VS YCP : పవన్ అంటే వైసీపీకి ఎందుకంత వణుకు?

వైసీపీ భావిస్తున్నట్టు రాజకీయం అంటే.. నిత్యం రాజకీయ ప్రత్యర్థులను తిట్టాలి. బూతులు మాట్లాడాలి. దానినే గొప్పగా రాజకీయం అని అభివర్ణించుకునే మనస్తత్వం వారిది.

Written By: Dharma, Updated On : May 1, 2023 3:27 pm
Follow us on

Pawankalyan VS YCP : వైసీపీ నేతలది వింత పరిస్థితి. వారు రాజకీయం కోసం ఏదైనా చేయవచ్చు. కానీ ప్రత్యర్థులు చేస్తే మాత్రం దానిని జీర్ణించుకోలేరు. తాము చేసింది లోక కళ్యాణం. అదే ప్రత్యర్థులు చేస్తే మాత్రం అది వ్యభిచారంగా భావిస్తుంటారు. తాము చేసేదానికి ఎక్కువ ప్రాచుర్యం లభించాలని భావిస్తుంటారు. గుడ్ మార్నింగ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పేటీఎం బ్యాచ్ కు పనిచెబుతుంటారు. అదే ఎదుటి వారు చేస్తే మాత్రం రంధ్రాన్వేషణ చేసి లోపాలను వెతుకుతుంటారు. ఇప్పుడు పవన్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. పవన్ చంద్రబాబుతో కలిసి కప్పు టీ తాగి మాట్లాడితే ఉలికిపడుతున్నారు. ఏదేదో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నట్టు ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారు. పవన్ కు రాజకీయాలు తెలియవంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. దమ్ముంటే 175 సీట్లో పోటీచేయాలని సవాల్ విసురుతుంటారు. పవన్ అంటే లెక్కలేనప్పుడు ఆయన చర్యలకు ఎందుకు భయపడుతుంటారో? అంటే మాత్రం సమాధానం ఉండదు.

తేలికతనం మాటలతో…
అసలు జనసేన ఒక పార్టీయేనా అని తేలికైన మాటలు చెబుతుంటారు. కానీ పవన్ తమ ఓటమికి కారకులవుతారని లోలోపల మదనపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ పై తేలిపోయే ప్రకటనలు చేస్తూ.. తమలో ఉన్న తేలిక తనాన్ని బయటపెట్టుకుంటారు. సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకూ అదే మాట. తాము వెళ్లి ఢిల్లీ పెద్దలను కలవొచ్చు. పొరుగు రాష్ట్ర సీఎంతో సఖ్యతగా మెలగవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టొచ్చు. కానీ విపక్ష నేతలు ఒకచోట కలిసి మాట్లాడుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ కొత్త ప్రచారాన్ని లేవనెత్తుతుంటారు. తెలుగునాట ఇటువంటి రాజకీయం గతంలో చూడలేదు. మున్ముందు చూడలేం కూడా. అంతటి రాజకీయ వికృత క్రీడకు తెరలేపి తమ గడసరి తనాన్ని ప్రజల ముందు ప్రదర్శిస్తున్నారు.

ఆ రోత రాతలు..
జగన్ మీడియాలో ఇటీవల వార్తలు ఒకసారి చూస్తే.. గడిచిన మూడు నెలలుగా సైలెంట్ గా ఉన్న పవన్ అని తమ రాతలు మొదలు పెడతారు. ఇప్పుడే బయటకు వచ్చినట్టు వండి వార్చుతుంటారు. మొన్నటికి మొన్న తమ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను తిడుతుంటే పవన్ స్పందించలేదా? అంతకు ముందు జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటుచేయలేదు. అంతకు ముందు రణస్థలంలో యువశక్తి పేరిట కార్యక్రమం నిర్వహించలేదా? సమకాలిన అంశాలపై .. ప్రజా జీవితానికి విఘాతం కలిగించే ప్రతిసారి పవన్ స్పందిస్తునే ఉన్నారు. జన సైనికులు ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా సరే జనసేనపై అదే పనిగా ప్రచారం చేసి ఆత్మ సంతృప్తి పొందుతున్నారు.

రాజకీయం అంటే అదా?
వైసీపీ భావిస్తున్నట్టు రాజకీయం అంటే.. నిత్యం రాజకీయ ప్రత్యర్థులను తిట్టాలి. బూతులు మాట్లాడాలి. దానినే గొప్పగా రాజకీయం అని అభివర్ణించుకునే మనస్తత్వం వారిది. ప్రజల్లో నిత్యం విష బీజాలు నింపడమే వారికి తెలిసిన రాజకీయ వ్యూహం. అదే రాజకీయం అయితే అటువంటిది తనకు అక్కర్లేదని పవన్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక వ్యూహాలు ఉంటాయి. ప్రతివ్యూహాలు అవసరం కూడా. అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైసీపీ విముక్త ఏపీయే తన అభిమతం అని చెప్పుకొచ్చిన పవన్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సాటి విపక్ష నేతగా చంద్రబాబును కలిశారు. దానిని కూడా పలువలు, చిలువలు చేస్తున్నారు. పవన్ కు వ్యూహమే తెలియదని.. అంతా బహిర్ముఖమేనని.. అది చంద్రబాబును సీఎం చేయడమేనన్న కొత్త పల్లవిని అందుకున్నారు. దానినే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే అటువంటి చర్యలు ప్రజల ముందు తేలిపోతున్నాయి. అధికారం దూరమైపోతుందన్న భయం మాటున చేస్తున్నవేనని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. వైసీపీ చర్యలను లైట్ తీసుకుంటున్నారు.