CM Jagan – DGP Rajendranath Reddy : డీజీపీని సైడ్ చేసే పనిలో జగన్

ఇప్పుడు డీజీపీ రవింద్రనాథ్ రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పోలీస్ శాఖలో మరో కుదుపు అన్నమాట

Written By: Dharma, Updated On : May 1, 2023 3:15 pm
Follow us on

CM Jagan – DGP Rajendranath Reddy : సీఎం జగన్ తమకు అన్నా అని పిలిచేసరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. అన్నా మీ అందరి సహకారం నాకు అవసరం అనేసరికి తోడబుట్టిన వాడి కంటే మిన్నగా చూసుకోవడం ప్రారంభించారు. ఇక తమకు తిరుగులేదని.. సీఎం అంతటి తమ్ముడు తమ వెంట ఉన్నాడని సంబరపడిపోయారు. దీంతో తెగ సలహాలివ్వడం ప్రారంభించారు. కానీ ఆ సలహాలు బుట్టదాఖలవుతున్నాయి. సలహాలు ఇచ్చిన వారు అప్రాధాన్య పోస్టుల్లోకి వెళ్లిపోతున్నారు. ఒకరా? ఇద్దరా? పదుల సంఖ్యలో అధికారులది ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ వంతు వచ్చింది. ఆయనకు అప్రాధాన్య పోస్టుకు పంపించేందుకు తెర వెనుక కసరత్తు జరుగుతోంది. ముందుగా ముఖ్యమైన అధికారాలు, అదనపు బాధ్యతల నుంచి తప్పించి.. అనక డీజీపీ పోస్టు నుంచి ఊస్టింగ్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ సాయం చాలదట..
అయితే ఏపీ సర్కారుకు పోలీస్ శాఖ నుంచి అంతులేని సహకారం లభిస్తుందన్నది ప్రజల నుంచి వినిపించే మాటే. రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ బాధితవర్గాలపై సర్కారు ఆశలకు అనుగుణంగానే పోలీస్ శాఖ పనిచేస్తోంది. కానీ జగన్ అంతకు మించి పోలీస్ శాఖ నుంచి ఆశిస్తున్నారు. కానీ అందుకు తగ్గట్టు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాచరణ, కసరత్తు చేయకపొవడమే ఆయనపై సీఎం జగన్ కోపానికి కారణం. అయితే జగనే ఏరికోరి రాజేంద్రనాథ్ రెడ్డిని పట్టుబట్టి మరీ డీజీపీగా నియమించుకున్నారు. వాస్తవానికి ఆయన పూర్తిస్థాయి డీజీపీ కాదు. కేవలం అడ్ హక్ డీజీపీగానే కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అయితే ఏ కారణమో తెలియదు కానీ ఆయన ఏపీ డీజీపీగా ఉన్నారు. కానీ జగన్ ఒక అంచనాతోఆయన్ను నియమిస్తే.. వాటిని అందుకోలేని స్థితిలో రాజేంద్రనాథ్ రెడ్డి ఉండడంతో పక్కకు తప్పించడమే శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఏసీబీ బాధ్యతలు తప్పించాలని..
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కొరడా ఝుళిపించింది. డీజీపీ రాజేంద్రానథ్ రెడ్డి ఆదేశాల మేరకేనంటూ పెద్దఎత్తున మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అది జగన్ కు మింగుడు పడడం లేదు. ప్రభుత్వం రైడింగ్ చేయిస్తే డీజీపీ పేరు రావడంపై జగన్ మండిపడ్డారుట. ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని ఆదేశాలిచ్చారుట. ఇటీవల ఏసీబీ రివ్యూ నిర్వహించారు. అటు డీజీపీగా ఇటు ఏసీబీ డీజీగా ఉండలేరని జగన్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అదే సమావేశంలో  ఎదురుగా కనిపించిన రవిశంకర్ అయ్యన్నార్ ను ఏసీబీ డీజీగా నియమిస్తే పోలే అంటూ జగన్ సెలివిచ్చారుట. కానీ రవిశంకర్ అయ్యన్నార్ కుఇంకా డీజీ హోదా రాలేదు. అంతసీనియర్ కాదు. ఆయన ఏడీజీనే. అది తెలియకుండా జగన్ ఆయనను నియమించాలని ఆదేశాలివ్వడంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. సీఎం జగన్ అవగాహన చూసి షాక్ గురయ్యారు.  ఏకంగా డీజీపీ నిర్వహిస్తున్న ఓ కీలకమైన విభాగాన్ని ఆయన నుంచి తప్పించాలన్న ప్రయత్నం చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ జాబితాలో మరొకరు..
అయితే ఏరికోరి తెచ్చుకున్న రాజేంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టుకు వెళ్లే ప్రమాదముంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త డీజీపీ ఎంపిక విషయంలో కేంద్రం నిబంధనలు గుర్తు చేసినా లేదా జగనే ఆయన వద్దని కొత్త వారిని ఎంపిక చేసుకున్నా.. డీజీగా చేసి రవీంద్రనాథ్ రెడ్డి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది అధికారులకు ఇటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అవమానాల నడుమే వారు తమ కొలువులను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డీజీపీ రవింద్రనాథ్ రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పోలీస్ శాఖలో మరో కుదుపు అన్నమాట. మరో అస్మదీయుడికి కీలక పోస్టు కట్టబెడతారన్న మాట. సీనియార్టీ, సిన్సియార్టీతో పనిలేకుండా ఎంతో మందినిసైడ్ చేసి మరో అధికారాని తెరపైకి తెస్తారన్న మాట.