KCR BJP Etela: ‘బుద్ది ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు.. దునియా మొత్తం చూస్తాడు..’ ఇప్పుడు అలాంటి కేసీఆర్ కొడుతున్న దెబ్బకు అటు ఈటల రాజేందర్ కు, ఇటు తెలంగాణ బీజేపీకి నోట మాటరావడం లేదట.. రాజకీయం అంటే అదేనబ్బా అని కేసీఆర్(KCR) నిరూపిస్తున్నాడు.. తెలంగాణ గల్లీలోకాదు.. ఢిల్లీలోనే కేసీఆర్ తేల్చేసుకుంటున్నాడు. తన పరపతి ఏంటో నిరూపిస్తున్నాడు. తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో ఎంత దూకుడు ప్రదర్శిస్తే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ ఆ పార్టీ అధినేతలతో అంతగా రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ఇటు ఈటల రాజేందర్(Etela Rajendar)ను.. అటు తెలంగాణ బీజేపీ(Telangana Bjp) నేతల ఆవేశంపై కేసీఆర్ నీళ్లు చల్లుతున్నాడు. ఆ పార్టీపై, నేతలపై ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేసేస్తున్నారన్న టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
-ఈటలను ఇరుకునపెడుతున్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. అందుకే తనను ఎదురించిన ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లి తొడగొడుతుంటే.. ఆయన పార్టీ అధినేతలతోనే కేసీఆర్ చట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఈటల వేదన అరణ్యరోదనే అవుతోంది.తెలంగాణలో ఇంతగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. ఢిల్లీలో తమ పార్టీ అధినేతలతో అంత క్లోజ్ గా మూవ్ కావడంతో ఈటలకు కక్కలేక మింగలేని పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణ బీజేపీ నేతలకు ఈ పరిణామం మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ టూర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిభిరాన్ని డిఫెన్స్ లో పడేసింది. టెన్షన్ పెడుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికపై పడే ప్రతి కూల ప్రభావంపై ఈటల లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. కేసీఆర్ కు దూరంగా బీజేపీ ఉంటుందని ఆశపడ్డారో ఇప్పుడు అదే వ్యతిరేకంగా జరగడంతో ఈటల రాజేందర్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.
-హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎఫెక్ట్
హుజూరాబాద్ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడం ఈటలకు పుండు మీద కారం చల్లినట్టైంది. ఇప్పటికే రెండు నెలలుగా ఆయన కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే కేసీఆర్ సర్కార్ ఎన్నికల నిర్వహణకు ఆసక్తి చూపకపోవడం.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడంతో ఈటలకు భారీగా దెబ్బపడింది. ఎన్నికలు జరిగితే గన్ షాట్ గా గెలిచే ఈటలను వాయిదా వేయించి మరీ కేసీఆర్ దెబ్బకొట్టాడని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా వెంటనే ఎన్నికలు జరిపించకపోవడం ఈటలకు, తెలంగాణ బీజేపీకి పెద్ద మైనస్ గా ఫెయిల్యూర్ గా అభివర్ణిస్తున్నారు. రెండు నెలల తర్వాత అప్పటికీ ఈటల సెంటిమెంట్ ఉంటుందో.. ఉండదో తెలియదు. అందుకే కేసీఆర్ తిప్పిన చక్రం ఇప్పుడు ఈటలకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.
-కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఈటల, బీజేపీకి మరో దెబ్బ
ఇదే సమయంలో పులిమీద పుట్రలా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపైనా హుజూరాబాద్ లో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు పైకి చెప్పకపోయినా అంతర్గతంగా చాలా ఆరాతీస్తున్నారట.. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ(Modi), హోంమంత్రి అమిత్ షా(Amith Shaw), కేంద్రమంత్రులతో సాన్నిహిత్యం నెరపడంతో హుజూరాబాద్(Huzurabad) ఉప ఎన్నికపై దీని ప్రభావం భారీగా పడుతుందని చెబుతున్నారు. బీజేపీపై ప్రతికూల సంకేతాలు పంపుతుందని ఈటల శిభిరం ఆందోళన చెందుతోందట.. హుజూరాబాద్ గల్లీలో కొట్లాడుతూ.. ఢిల్లీలో కేసీఆర్ తో బీజేపీ పెద్దల దోస్తీని ఎలా వివరించాలో తెలియక ఈటల, తెలంగాణ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టుగా సమాచారం.
-ఈటలకు బీజేపీపై ఆదినుంచి అనుమానమే?
టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే సమయంలోనే ఈటల రాజేందర్ చాలా చర్చలు, తర్జన భర్జన పడ్డారు. కాషాయ కండువ కప్పుకోవడానికి తటపటాయించారు. ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రశ్నలు వేశారు. టీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న సంబంధాలపై స్పష్టత కోరారు. టీఆర్ఎస్ తో ఎటువంటి సాన్నిహిత్యం ఉండదని బీజేపీనేతలు చెప్పిన తర్వాతే ఈటల కాషాయదండులో చేరారు. ప్రస్తుతం అదే ఊపుతో హుజూరాబాద్ లో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. కానీ నాడు ఏదైతే ఈటల అనుమానించారో ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ టూర్ లో అదే జరుగుతోంది. కేసీఆర్ కు ఢిల్లీలోని మోడీ షా నుంచి కేంద్రమంత్రుల వరకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ఈటలకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. హుజూరాబాద్ లో దీన్ని ఎలా కవర్ చేయాలో తెలియక బీజేపీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయట..
-కేసీఆర్ ఢిల్లీ టూర్ తో డిఫెన్స్ లో ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఆలస్యం కావడం.. కేసీఆర్ ఢిల్లీ టూర్ లో మోడీ, షా, కేంద్రమంత్రులతో భేటీలపై ఈటల శిబిరంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని కాంగ్రెస్ విమర్శల వేడి పెంచింది. ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్-మోడీ కలవడంతో అదేనిజం అని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇటు బండి సంజయ్(Bandi sanjay), అటు ఈటల రాజేందర్ లు కేసీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎంత గొంతుచించుకున్నా ఢిల్లీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుతో వీరు విమర్శలకు విలువ లేకుండా పోతోందన్న ఆవేదన క్షేత్రస్థాయి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామం హుజూరాబాద్ లో ఈటలకు ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్న ఈటల కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టి అనుచరుల ద్వారా కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ఆరాతీస్తున్నట్టు సమాచారం.
-ఈటల మౌనంగా రోదిస్తున్నారా?
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బీజేపీ పెద్దలను కలవడం ఈటలకు హుజూరాబాద్ లో భారీ మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బండి సంజయ్ పాదయాత్రలో కేసీఆర్ పై విరుచుకుపడడం నిష్ఫలం అవుతోందని అంటున్నారు. ఈటల రాజేందర్ ఇప్పటివరకు కేసీఆర్ ఢిల్లీ టూర్ పై నోరు విప్పింది లేదు. బీజేపీలో చేరి తప్పు చేశామా? అన్న భావన ఈటల వర్గాల్లో వ్యక్తమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల నోరు విప్పకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు. కేంద్రంలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ అంటే బీజేపీ, టీఆర్ఎస్ బంధంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతాయనే భావన ఈటల వర్గంలో ఉంది. అందుకే ఈ మధ్య బీజేపీ కాషాయ రంగు కారులను సైతం ఈటల మార్చేశారని.. బీజేపీ గురించి తీయకుండా తన వ్యక్తిగత ఇమేజ్ తో గెలవాలని ఈటల ప్లాన్ చేసుకుంటున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Why is there tension in telangana bjp over kcr delhi tour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com