Revanth Reddy: భారత రాష్ట్ర సమితికి ఉత్తర తెలంగాణ పెట్టని కోట. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలో ఉత్తర తెలంగాణ కీలకపాత్ర పోషించింది. భారత రాష్ట్ర సమితి రెండుసార్లు అధికారంలోకి రావడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం అత్యంత కీలకమైంది. భారత రాష్ట్ర సమితి రాజకీయంగా ఎదిగేందుకు కూడా ఉత్తర తెలంగాణ తోడ్పడింది. రెండు పర్యాయాలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావడానికి ఉత్తర తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగింది. ఫలితంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం భారత రాష్ట్ర సమితికి పెట్టని కోటగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితి అయింది. ప్రజలు ఇష్టపడి గెలిపించుకున్న నేతలు అవినీతికి పాల్పడడం మొదలుపెట్టారు. రెండు పర్యాయాలు అధికారంలోకి రావడంతో సహజంగానే భారత రాష్ట్ర సమితి మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన భారతీయ జనతా పార్టీ దిక్కులు చూస్తోంది. దీంతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తోంది. స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ఆయన అత్యంత వేగంగా పావులు కదిపారు. అందువల్లే ఇతర పార్టీలనుంచి చేరికలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ నుంచి ఈ చేరికలు మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత రాష్ట్ర సమితి నేత మండవ వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక వారిద్దరూ అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలి ఉంది. ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి నాయకత్వంపై కార్యవర్గానికి అసంతృప్తి ఉన్న నేపథ్యంలో దానిని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. రాహుల్ గాంధీ ద్వారా నిర్వహించే బస్సు యాత్ర పార్టీకి సరికొత్త బలాన్ని ఇస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఉత్తర తెలంగాణలో రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ప్రాంతంలో ఇంత గట్టిగా విజయం సాధిస్తే అధికారానికి అంత దగ్గరవుతామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందువల్లే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధికార భారత రాష్ట్ర సమితి నాయకులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదని, కేవలం తమ అనుయాయులకే కాంట్రాక్టులు ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులపై రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దృష్టిసారించింది. వారితో పలు దఫాలుగా చర్చలు నిర్వహించింది. దీంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వీరు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నాయకులను కూడా కాంగ్రెస్లోకి లాగేందుకు రేవంత్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి ఉత్తర తెలంగాణలో పోయిన పట్టును తిరిగి సాధించి అధికారంలోకి రావాలని రేవంత్ భావిస్తున్నారు.