CM KCR: అనూహ్యంగా వ్యవహరించటం.. అంచనాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటం.. అందరు అనుకున్నది అస్సలు చేయకుండా ఉండటం లాంటి విచిత్రమైన తీరును ప్రదర్శిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను తప్పులు చేయొచ్చు కానీ.. అదే తప్పులు తన ప్రత్యర్థులు చేయటాన్ని అస్సలు క్షమించరు. తాను టార్గెట్ చేసిన రాజకీయ పార్టీలు కనుమరుగు అయ్యేలా చేయటాన్ని రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించే గులాబీ బాస్.. ఆయన పార్టీని ఎవరైనా టార్గెట్ చేస్తే.. తెలంగాణపై జరుగుతున్న దాడిగా, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రగా అభివర్ణిస్తారు. తాజాగా దేశ రాజకీయాల్లోలనే సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణలో రచ్చ జరుగుతుంటే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం నోరు మెదపడం లేదు. ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీగా ఎర వేసి.. బీజేపీ గూటికి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయటం.. దానిని ముందస్తుగా గుర్తించి.. తమ వారికి విసిరిన వలను.. తెలివిగా వల విసిరిన వారికి.. అదే వలతో ఉచ్చు బిగిసేలా చేశారు కేసీఆర్. మొత్తంగా తనను టార్గెట్ చేసిన కమలనాథుల్ని.. ఆయన తెలివిగా ఆత్మరక్షణలో పడేయటంతోపాటు.. తాను చేస్తున్న వాదన నిజమన్న భావన కలిగించేందుకు వీలుగా ప్రగతి భవన్ నుంచి ఒక్కో ఆడియోను విడుదల చేస్తున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. సీఎం ప్రెస్‌మీట్ ఉంటుందని, టీఆర్ఎస్, ప్రగతిభవన్ వర్గాల నుంచి లీకులు ఇస్తున్న గులాబీ బాస్, తర్వాత వాయిదా వేస్తున్నారు. మొదట హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ అన్నారు.. తర్వాత ఢిల్లీ వెళ్లి అక్కడే బీజేపీ బండారం బయటపెడతారని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి బయటకు రావడం లేదు. ఫామ్‌హైస్‌లో కనిపించిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా మీడియా కంట పడకుండా కాపాడుతున్నారు. దీంతో కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో..
తొలుత గురువారం పెడతారన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? శుక్రవారం కచ్చితంగా పెడతారని భావించిన ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టలేదన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ ఎపిసోడ్ మీద సంచలన ప్రెస్‌మీట్ ఖాయంగా ఉంటుందని.. కేసీఆర్ కోరుకున్న బజ్ ఇంకా రాకపోవటంతో ఆయన తనదైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్‌పై జాతీయ మీడియా తాను అనుకున్నంత ఎక్కువగా రియాక్టు కాకపోవటంతో ప్రెస్ మీట్ ఆలోచనపై వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
ఆడియో టేప్‌లు లీక్ చేసినా…
జాతీయస్థాయిలో ఈ వ్యవహారంపై చర్చ జరుగాలన్న ఆలోచనలో ఉన్న గులాబీ బాస్.. అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రెండు ఆడియో టేప్‌లను కూడా లీక్ చేయించారు. ప్రగతి భవన్ నుంచే ఈ ఆడియో రికార్డులు లీక్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయినా జాతీయ పార్టీలుగానీ, ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, డీఎంకే, ఆప్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రధానిపైగానీ, బీజేపీపైగాని విమర్శలు చేయడం లేదు.

ప్రెస్‌మీట్‌తో కథ ముగిసినట్లే..
కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత
ఈ వ్యవహారాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. జనం కూడా మర్చిపోతారు. దీంతో ప్రెస్‌మీట్ కన్నా ముందే ఇది సంచలనం కావాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈమేరకు మరిన్ని ఆడియోలను లీక్ చేసేందుకు కసత్తు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే వీడియోలు కూడా లీక్ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా వెల్లడయ్యే అంశాలతో ఈ విషయంపై చర్చ కొనసాగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ఇష్యూను జాతీయ మీడియా హైలెట్ చేసే వరకు వెయిట్ చేసి.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. మరి కేసీఆర్ ఆశించిన మైలేజ్ వస్తుందా.. ఈ వ్యవహారంపై ప్రెస్‌మీట్ ఉంటుందో లేదో వేచిచూడాలి.