CM Jagan: ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపునకు అనేక ఫార్ములాలను తెరపైకి తెస్తున్నారు. అవి వర్కవుటవుతాయో తెలియదు కానీ పార్టీలో విభేదాలకు అవకాశం కల్పించినట్టువుతుంది. ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెంచారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఇలా చెప్పుకుంటూపోతే సీఎం జగన్ ప్రత్యర్థుల జాబితా చాంతాడంత ఉంది. వచ్చే ఎన్నికల్లో వీరిని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదన్న కసితో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబును ఓడించి వస్తే.. అందుకు సహకరించిన నేతలకు ఎమ్మెల్సీ పదవులను ఎరగా వేస్తున్నారు. అయితే గతంలో ఇదే మాదిరిగా చాలా మంది నాయకులకు అభయమిచ్చారు. కానీ ఎటువంటి పదవులు కేటాయించలేదు. ఈ క్రమంలో సీఎం నేతల మధ్య పోటీపెంచి విభేదాలకు అవకాశమిస్తున్నారన్న టాక్ అధికార పార్టీలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పుడు జగన్ నియోజకవర్గాల రివ్యూలు మొదలు పెట్టారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మధ్య గ్యాప్ ఉంది. ఒక్కో చోట తారాస్థాయికి చేరుకుంది. అటువంటి చోట ఎమ్మెల్యేలతో విభేదిస్తున్నవారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెబుతున్నారు. అయితే ఇలా సీఎం హామీ మేరకు దాదాపు 100 మందికైనా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వల్సి వస్తుందని అధికార పార్టీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సమీక్ష నిర్వహించారు. ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం తట్టుకొని మరీ నిలబడ్డారు. ఇక్కడ కింజరాపు కుటుంబానికి గట్టి పట్టుంది. ఇక్కడ అచ్చెన్నాయుడుపై పోటీచేసే క్యాండిడేట్ గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేశారు. అయితే గతఎన్నికల్లో పోటీ చేసిన కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి ఇక్కడ ఆశావహులుగా ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ను గెలిపించుకొని వస్తే తిలక్ కు ఎమ్మెల్సీ పదవి ఆఫరిచ్చారు. అటు కృపారాణికి నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గెలవకపోతే అతడ్ని ఎమ్మెల్సీగా కొనసాగింపు తప్పదని.. అటువంటప్పుడు మీకు ఎమ్మెల్సీ పదవి రాదని సరికొత్త లాజిక్ చెప్పేశారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే టెక్కలిలో అచ్చెన్నాయుడు ఓటమి ఏమంత కష్టం కాదని కూడా జగన్ తేల్చేశారు.

గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను స్వీప్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వందకు పైగా సర్పంచ్ లు, అదే స్థాయిలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిచిన విషయాన్ని జగన్ ఈ సమీక్షలో ప్రస్తావించారు. అయితే సమీక్షకు హాజరైన వైసీపీ నేతలు దువ్వాడ వైఖరితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి పరిణామంలో జరిగాయో వివరించే ప్రయత్నించగా జగన్ అడ్డుకట్ట వేశారు. దువ్వాడ శ్రీనివాసే ఫైనల్ గా క్యాండిడేట్ అని.. నియోజకవర్గానికి వెళ్లి పనిచేసుకోవాలని పురమాయించారు. దీంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు చెబుదామనుకుంటే అధినేత తమ గొంతు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడమనేది కల్లేనని తేల్చేశారు. నిట్టూర్పుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే రాజకీయ ప్రత్యర్థుల విషయంలో జగన్ దూకుడు మొదటికే మోసం తెస్తుందని వైసీపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.