Munugode By Election- TRS: ఒక్క నియోజకవర్గం.. ఒకే ఒక్క నియోజకవర్గం.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను కుదిపేసింది. వాస్తవానికి ఇది సిట్టింగ్ నియోజకవర్గం కూడా కాదు. అయినప్పటికీ.. టీఆర్‌ఎస్ కు మాత్రం ఈ నియోజకవర్గం ప్రాణంకన్నా ఎక్కువగా మారిపోయింది. కేసీఆర్ నాయకత్వానికి.. ఆయన పాలనకు మునుగోడు నియోజకవర్గం అగ్నిపరీక్షగా మారింది. దీంతో విజయం కోసం ఆ పార్టీ ఇక్కడ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ప్రచారం కోసం గులాబీ దండు మోహరింపు నుంచి చివరి రోజు పోల్ మేనేజ్‌మెంట్ వరకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. టీఆర్ఎస్ ను గెలిపించేలా ప్లాన్ చేశారు. మనుగోడును టీఆర్ఎస్ ఎందుకింతలా ప్రాణంగా భావించింది.. ప్రాణాలొడ్డి పోరాడింది? ఎలా పనిచేసిందన్న దానిపై స్పెషల్ ఫోకస్.

-గులాబీదండు మొత్తం మునుగోడులోనే..
అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన 80 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఎంపీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, ఎమ్మెల్సీలు మొత్తం నెలరోజులు మునుగోడులోనే మకాం వేశారు. టీఆర్‌ఎస్ గెలుపుకోసం దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ప్రచారం చేశారు. ఒక్కో గ్రామానికి ఒక్కో ఎమ్మెల్యే అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఇన్‌చార్జీలను నియమించారు. చివరకు తాను కూడా ఒక గ్రామానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. ప్రతీ ఓటరును మూడు నాలుగుసార్లు కలిసేలా ప్రచారం నిర్వహించారు.
-కేసీఆర్ రెండు సభలు..
ఇక నెల రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రెండు సభలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచింది. తాజాగా మునుగోడుపై దృష్టిపెట్టింది. బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కంటే బలమైన వ్యక్తి కావడం, రాజగోపాల్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో బీజేపీకి గెలుపు అవకాశం ఎక్కువగా ఉంటాయని అంచనా వేసిన కేసీఆర్.. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థిపై స్థానికంగా వ్యతిరేకత ఉండడంతో మునుగోడులో బీజేపీని దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం తన బలగాన్ని మొత్తం మునుగోడులోనే మోహరించారు. నెల రోజులు రాష్ట్రంలో పాలన స్తంభించినా లెక్క చేయలేదు. పాలన కంటే మునుగోడు గెలుపే తనకు ముఖ్యమని భావించారు.
-కొడుకు, అల్లుడికి ఇన్‌చార్జి బాధ్యతలు..
గతంలో జరిగిన ఉప ఎన్నికలకు తన మేనల్లుడు మంత్రి హరీశ్‌రావును మాత్రమే కేసీఆర్ ఇన్‌చార్జిగా నియమించుకుంటూ వచ్చారు. గెలుపు బాధ్యతను పూర్తిగా హరీశ్‌పైనే వేసేవారు. మునుగోడులో మాత్రం అల్లుడితోపాటు తన కొడుకు, ఐటీ మంత్రి కేటీఆర్‌ను కూడా మునుగోడు ఇన్‌చార్జిగా నియమించారు. జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వీరికి అదనం. హరీశ్‌రావు, కేటీఆర్ కూడా సభల, రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. తమదైన శైలిలో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
-చేరికలు.. నిధులు.. పెండింగ్ బిల్లులు.. ఉద్యోగులకు వేతనాలు..
ఇక మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌పై ఎవరికీ వ్యతిరేకత ఉండకూడదన్న భావనతో కేసీఆర్ మొదట అభివృద్ధిపై దృష్టిపెట్టారు. కొత్త మండలం కేటాయించారు. రోడ్డు నిర్మాణం చేపట్టారు. వివిధ అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేయించారు. రెండో విడత గొర్రెల పంపిణీ రాష్ట్రంలో ఎక్కడా చేయకున్నా మునుగోడులో మాత్రం యాదవులకు గొర్రెల పంపిణీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఇతర పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్పంచ్ నుంచి ఎంపీపీ వరకు అందరినీ కొనే ప్రయత్నం చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించారు. ఐదు నెలలుగా సర్పంచులకు బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం మునుగోడులో మాత్రం మంజూరు చేసింది. పెండింగ్ బిల్లులు కూడా ఇచ్చింది. ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందకు నవంబర్ 1వ తేదీనే జీతాలు చెల్లించింది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ మంజూరు చేసింది.
-కేసీఆర్ దిశానిర్దేశం మేరకే పోల్ మేనేజ్‌మెంట్
ఇక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్‌మెంట్‌లనూ కేసీఆర్ తన మార్కు చూపించారు. ప్రతిపక్షాలు పోల్ మేనేజ్‌మెంట్ చేయకుండా కట్టడి చేయడంతోపాటు టీఆర్‌ఎస్ నేతలను ఎవరూ అడ్డుకోకుండా చూడగలిగారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సహకారంతో ప్రతిపక్షాలు ఓటర్లను కలుసుకోకుండా నియంత్రించగలిగారు. పోలీసుల సహకారంతో టీఆర్‌ఎస్ నాయకుడు డబ్బులు పంచుతూ పట్టుబడినా వారిని పోలీసుల సహాయంతో తప్పించగలిగారు. ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఉండొద్దన్న నిబంధన ఉన్నా.. టీఆర్‌ఎస్ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘించారు. కేసీఆర్ ఆదేశాలతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే ఉన్నారు. వీరికి పోలీసులు రక్షణ కల్పించారు. ఇక డబ్బుల పంపిణీలో అయితే తనదైన మార్కు చూపారు కేసీఆర్. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించేలా చూశారన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది. పది మంది ఓటర్లు ఉన్న కుటుంబాలకు తులం బంగారం కూడా అందించినట్లు సమాచారం. ఫలితం తర్వాత పోల్ మేనేజ్ మెంట్ గురించి ఎవరూ పట్టించుకోని ఫలితమే మాట్లాడుతుందన్న ఉద్దేశంతో చివరి రెండు రోజులు కేసీఆర్ స్వయంగా నియోజకవర్గ పరిస్థితిని పర్యవేక్షించాచరు.

-ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని..
కాంగ్రెస్ ఓడిపోయినా.. సిట్టింగ్ సీటు కోల్పోయామనే ఆవేదన ఉన్నప్పటికీ.. పరిస్థితిని పునఃపరిశీలించుకుని అడుగులు వేస్తామని చెప్పుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ టీఆర్‌ఎస్ ఓటమి చెందితే? పరిస్థితి ఏమిటన్న ప్రశ్న గులాబీనేతలకు తలెత్తింది. 7 ఏళ్లుగా అధి కారంలో ఉంది. ఈ ఏడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నామని.. సీఎం కేసీఆర్ చెబుతున్నారు. నిధులు–నీళ్లు ప్రజలకు రైతులకు సంపూర్ణంగా అందిస్తున్నామని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సెంటిమెంటును కూడా ఆయన ఎప్పటికప్పుడు రాజేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు , రైతు బంధు, కళ్యాణలక్ష్మి దళిత బంధు, ఇలా.. సంచలనాత్మక పథకాలు ప్రవేశ పెట్టామని పదేపదే చెప్పారు. ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లినా.. పార్టీ పరువు పోవడంతోపాటు.. సీఎం కేసీఆర్ పాలనపైనా.. మరకలు పడే అవకాశం ఉంది. అందుకే మునుగోడులో అన్నీ తానై ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేశారు.
-ఇదంతా బీఆర్‌ఎస్ కోసమేనా?..
దసరా పండుగ రోజు సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఈ సందర్భంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే దాని ప్రభావం బీఆర్‌ఎస్‌పైనా పడుతుందని గులాబీ బాస్ భావించారు. ప్రతిపక్షాలకు ఒక అస్త్రం అవుతుందని, టీఆర్‌ఎస్‌పై ప్రజా వ్యతిరేకత ఉందన్న భావన వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని కేసీఆర్ అంచనా వేశారు. ఈనేపథ్యంలోనే గతంలో ఏ ఉప ఎన్నికను తీసుకోని విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడారు. జాతీయ రాజకీయాల్లోకి మునుగోడు విజయంతో ఘనంగా ఎంట్రీ ఇచ్చేందుకు.. వచ్చేసారి తనదే అధికారం అని నిరూపించుకునేందుకే మునుగోడులో తన అన్ని అస్త్రశస్త్రాలు కేసీఆర్ ప్రయోగించారు.