ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్లకు ఇటీవల ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఓట్ షేర్ ఎంత అనే లెక్కల్లో పడ్డాయి. దాదాపు ఒక్క మున్సిపాలిటీ మినహా మిగితా వాటన్నింటినీ కైవసం చేసుకుంది వైసీపీ. అంతటా వైసీపీ జెండా ఎగిరింది. అయితే.. ఈ సారి జరిగిన ఎన్నికల్లో కేవలం 62 శాతం మందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాస్తవానికి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ లేకపోయినా.. 80 శాతం మంది ఓటర్లు పోటెత్తి మరీ ఓట్లేశారు.
దీంతో టీడీపీ.. చాలా పంచాయతీను రాబట్టుకుంది. కానీ.. స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ కూడా 75 శాతం నుంచి 80 శాతం మధ్య ఓటింగ్ జరుగుతుందని అందరూ అంచనా వేసుకున్నా.. చివరి నిమిషంలో ఓటర్లు నిర్లిప్తతగా వ్యవహరించారు. దీంతో పంచాయతీ ఓట్ల శాతాన్ని స్థానికం అధిగమించలేక పోయింది. అంతేకాదు.. గత సార్వత్రిక ఎన్నికల్లో 82 శాతంగా ఉన్న ఓటింగ్ కూడా ఇప్పుడు నమోదు కాలేదు. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది.
ఒకవేళ ఓటింగ్ కనుక 80 శాతం జరిగి ఉంటే.. ఫలితం ఎలా ఉండేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన ఓటింగ్‌లో వైసీపీకి 52 శాతం పైగానే ఓట్లు పోలయ్యాయి. ఇక.. టీడీపీకి 30 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీకి పెరిగి.. టీడీపీకి తగ్గినట్టుగా భావించాలి. అలా కాకుండా.. గత సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే.. ఇప్పుడు కూడా ఓటింగ్ 80 శాతం దాటితే.. అంటే.. మరో 18 నుంచి 20 శాతం ఓట్లు కనుక పడితే ప్రతిపక్షం పుంజుకునేదని తెలుస్తోంది.
అయితే.. ఈ 18–-20 శాతం ఓట్లు ఎవరివి ? వారు ఎందుకు పోలింగ్‌పై ఆసక్తి చూపలేదనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా.. ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చేవి కావు. అదే సమయంలో బలమైన మార్పులకు నాంది పలికేవీ కావు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నాడిని స్పష్టం చేయాలని అనుకున్న వారు కూడా ఎందుకులే అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇంత కష్టపడి వెళ్లి సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తే.. ఇప్పుడు మనకు వచ్చేదేంటి..? వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం లే.. అని సాధారణ మధ్య తరగతి వర్గం ఎక్కువగా భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ 18 శాతం ఓట్లు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేననేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్