https://oktelugu.com/

Vanama Venkateshwara Rao: అనర్హుడైనా ‘వనమా’కు ఎందుకు కేసీఆర్ టికెట్ ఇచ్చాడు?

సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఆ కేసు కు సంబంధించి తీర్పు వెల్లడించింది. వనమా వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేసింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 21, 2023 / 03:53 PM IST

    Vanama Venkateshwara Rao

    Follow us on

    Vanama Venkateshwara Rao: అందరూ అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 2018 సాంప్రదాయాన్ని కొన్ని కొన్ని మార్పులు చేర్పులతో పాటించారు. గతంలో పలుమార్లు పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రకటించినట్టుగానే అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను పరిచయం చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మరొక తీరుగా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. అయితే ఈ ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి ఆయన తప్పుడు వివరాలు సమర్పించిన నేపథ్యంలో అప్పట్లో ఆయన చేతిలో ఓడిపోయిన జలగం వెంకట్రావు కోర్టు మెట్లు ఎక్కారు.

    సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఆ కేసు కు సంబంధించి తీర్పు వెల్లడించింది. వనమా వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును అమలు చేసే విషయంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్, కార్యదర్శి ఒకింత తాత్సారం ప్రదర్శించడంతో వనమా సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. అయితే తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వనమా పేరు ఉండడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులనే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. వనమాకు టికెట్ ఎలా ఇస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది.

    ఇక గత కొంతకాలంగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఇదే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు ఉంటే తాను కచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరపు నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావు కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కూడా ఆయన పేరును ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుపోవడంతో లైన్ క్లియర్ అయింది. అయితే జలగం వెంకట్రావు పేరు జాబితాలోకి తీసుకోకపోవడంతో ఆయన వర్గీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆగ్రహంగా ఉన్నారు.

    ఇక వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవ ఈ ఏడాది ప్రారంభంలో ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. క్రమంలో భారత రాష్ట్ర సమితి అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటినుంచి వనమాకు ముఖ్యమంత్రి ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. హఠాత్తుగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే వనమా పేరు జాబితాలో రావడంతో అటు జలగం వర్గీయులు, ఇటు గడల శ్రీనివాసరావు వర్గీయులు రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వనమాను ఎలాగైనా ఓడించాలని ప్రతిజ్ఞ బూనారు.