
అధికారం లేకపోతే ఎవ్వరూ కానరు అనేది వాస్తవం. కానీ.. మరీ ఇంతలా వీకైపోతారా? ఇన్నాళ్లూ చేతులు కట్టుకున్నవాళ్లే పరోక్ష బెదిరింపులకు సైతం దిగుతురా? ఆ బెదిరింపులు భయపెడతాయా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ ను చూస్తే! 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ అధిష్టానం హవా ఏంటన్నది తెలియంది కాదు. సోనియా గాంధీ మాటకు తిరుగు లేదు.. హై కమాండ్ కు ఎదురే లేదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. రాష్ట్ర నాయకులు ఏదైనా చెప్పాలంటేనే.. వెనకా ముందు పదిసార్లు ఆలోచించుకునేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైందనే ప్రచారం సాగుతోంది.
అప్పుడెప్పుడో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ‘‘పీసీసీ భారము నేను మోయజాలను’’ అంటూ చేతులు ఎత్తేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచి మొదలైన గోల.. ఇప్పటి దాకా తెలుగు డైలీ సీరియల్ ను తలపిస్తూనే ఉంది. రోజులు మారిపోతున్నాయి.. నెలలు గడిచిపోతున్నాయి.. కానీ, పీసీసీ అధ్యక్షున్ని మాత్రం నియమించలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాక్కావాలంటే.. నాక్కావాలంటూ.. సీనియర్లు కొట్టుకోవడమే.
మరి, ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు లెక్కలు తెరపైకి వస్తాయి కదా..? అది చూసుకున్నప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి పేరునే సూచించారు. ఇప్పటికీ సూచిస్తున్నారు. అసలే.. రెండు సార్లు అధికారానికి దూరమైంది. అవకాశం ఉన్న నేతలంతా ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోయారు. మరోసారి కూడా అధికారం చేజారిపోతే.. పార్టీ పుట్టి మునిగినట్టేననే భయం కేడర్ లో ఉంది. అందుకే.. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా ఉన్న నేతగా రేవంతే సరైనవాడు అని భావిస్తున్నారు.
అయితే.. దశాబ్దాలుగా పార్టీని పట్టుకు వేళాడుతున్న తమను కాదని, వేరే పార్టీలో నుంచి వచ్చిన రేవంత్ కు ఎలా ఇస్తారని రగిలిపోతున్నారట సీనియర్లు. ఈ మేరకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య లెటర్ హెడ్ మీద లేఖ కూడా రాశారట. ఇందులో తమ ఆక్రోశం అంతా వెల్లగక్కారట. చివరకు పార్టీకి విధేయులుగా ఉన్నవారికే పీసీసీ ఇవ్వాలని డిమాండ్లు వినిపించారట. సీనియారిటీ డిమాండ్ వర్కవుట్ కాకపోవడంతోనే.. ఈ విధేయత అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.
పార్టీ అధిష్టానం కూడా రేవంత్ వైపే మొగ్గు చూపుతోందని టాక్. కానీ.. ఆయనకు ఇస్తే మాత్రం తాము సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారట సీనియర్లు. అంటే.. ఇన్నాళ్లూ ఎదురుగా మాట చెప్పడానికే ఆలోచించేవాళ్లు.. ఇవాళ బెదిరింపులకు సైతం దిగుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు అధిష్టానం సైతం ఇన్నాళ్లూగా నానబెడుతూ పీసీసీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతోందంటే.. నిజంగానే కాంగ్రెస్ హైకమాండ్ ఇంత వీకైపోయిందా? అనే చర్చ సాగుతోంది. మరి, దీనికి అధినాయకత్వం ఏం సమాధానం చెబుతుందో?