YCP: వైసీపీలో ఏదో జరుగుతోంది? ఆ పార్టీ నేతలు ఎందుకో అంతర్మధనం ప్రారంభమైంది. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం తెగ ఆందోళన చెందుతున్నారు. టిడిపి, జనసేన కూటమి, పవన్ దూకుడు, చంద్రబాబు అరెస్టు తదితర పరిణామాలతో అధికార పార్టీ నేతల్లో కలవరపాటు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో మూల్యం తప్పదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైసిపి నేతలు దూకుడు తగ్గించి వైరాగ్యపు మాటలు వల్లించడంతో వారిని తెలియని భయం వెంటాడుతోందని అర్థమవుతోంది.
ప్రకాశం జిల్లాలో తాజాగా వైసీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటన్నది ఆలోచించుకోవాలని అధికార పార్టీ నేతలకు సూచించడం విశేషం. మన మధ్య ఉండే విభేదాలతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దని ఆయన హితబోధ చేయడం విశేషం. వాలంటీర్ల సహకారంతో, సమన్వయం చేసుకొని ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుందని బాలినేని తేల్చి చెప్పారు. జగన్ను మరోసారి సీఎం చేయాలన్న కసితో పని చేయాలని పిలుపునివ్వడం విశేషం.
మరోవైపువైసిపి నేతల్లో భయం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని సీఎం జగన్ కే నేరుగా చెప్పానని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల ప్రకటించారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఆయన భయపడ్డారు అన్న ప్రారంభమైంది. తన కుమారుడికి లైన్ క్లియర్ చేయాలని ధర్మాన భావించి ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ టిడిపి, జనసేన కూటమికి భయపడే అలా మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి గాను తన నియోజకవర్గంలో మత్స్యకార ప్రాంతాన్ని ధర్మాన సందర్శించారు. మత్స్యకారుల కోసం వైసీపీ ప్రభుత్వం పాటుపడుతున్నా..మీరెందుకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నారని మత్స్యకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవి కూడా ధర్మానలో భయాన్ని బయటపెడుతున్నాయి.
వైసీపీలో వై నాట్ 175 అన్న స్లోగన్ ఇటీవల బలహీన పడింది. కానీ సర్వేలు మాత్రం ఏకపక్ష విజయాన్ని కట్టబెడుతున్నాయి. కానీ అవి వైసీపీ నేతలకు సంతృప్తి ఇవ్వలేకపోతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు దూరం కావడం, యువత సైతం అసంతృప్తితో ఉండడం అధికార పార్టీ నేతల్లో కలవరానికి కారణం. ప్రధానంగా అర్బన్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు పై వైసీపీ నేతలు ఆశలు వదులుకున్నారు. అక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉండడం, ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఓట్లు ఎక్కువగా ఉండడం తదితర కారణాలతో నేతలు భయపడుతున్నారు.