Homeఆంధ్రప్రదేశ్‌Jayaho BC Sabha: ఇంతకీ బీసీలు ఎవరి పక్షం.. ఈ గర్జనలు వర్కవుట్ అవుతాయా?

Jayaho BC Sabha: ఇంతకీ బీసీలు ఎవరి పక్షం.. ఈ గర్జనలు వర్కవుట్ అవుతాయా?

Jayaho BC Sabha: బీసీలు ఇప్పుడు ఎవరి పక్షం.. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. ప్రభుత్వం జయహో బీసీ గర్జనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల్లో కొత్త సంశయం ఏర్పడుతోంది. ముఖ్యంగా తమకు తాము బీసీలము అని మరిచిపోయిన వర్గాలు సైతం ఆరా తీస్తుండడం విశేషం. పేరుకే వెనుకబడిన వర్గాలు కానీ.. వారి కోసం ప్రత్యేక రాయితీలు లేవు.. స్వయం ఉపాధి పథకాలు లేవు.. రుణాలు లేవు.అటువంటప్పుడు ఈ బీసీ అన్న అడ్డుగీత ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఇప్పుడు జగన్ సర్కారుకు బీసీలు గుర్తుకు రావడానికి కారణం… గత ఎన్నికల్లో తమను ఆదరించిన వర్గాలుగా ఉన్న వీరు ఇప్పుడు ఎక్కడ దూరమవుతారన్న వ్యథ వారిని వెంటాడుతోంది. అందుకే ‘జయహో’ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ఉన్న పార్టీలకు సామాజికవర్గాల తోకను ఎప్పుడో తగిలించేశారు. కమ్మ అయితే టీడీపీ, రెడ్డి అయితే వైసీపీ, కాపు అంటే జనసేన అని విభజించారు. ఇక సందర్భానుసారం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ఏదో పార్టీకి కొమ్ము కాయవలసిన పరిస్థితి. తొలుత కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు మళ్లింది.ఇప్పుడు మిగిలినది బీసీ వర్గాలు మాత్రమే. ఏపీ సమాజంలో జనాభాలో సగానిపైగా ఉన్న ఈ వెనుకబడిన వర్గాల మద్దుత కోసమే ఇప్పుడు ఈ సరికొత్త బీసీ గర్జన. అయితే ఇటువంటి గర్జనలు చాలా చూశాం. గత ఎన్నికలకు ముందు బీసీలకు మద్దతుగా చంద్రబాబు ఇదే మాదిరిగా గర్జించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పడది జగన్ వంతు వచ్చింది.

Jayaho BC Sabha
Jayaho BC Sabha

 

వెనుకబడిన వర్గాల వారి టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. దీనికి కారణం టీడీపీ బీసీ వర్గాల నాయకులను ప్రోత్సహించడమే. 1983కు ముందు కాంగ్రెస్ పార్టీ అణగారిని వర్గాల వారిని ఓటు బ్యాంకుగా మలుచుకుంది. నాయకత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం పెద్ద సామాజికవర్గాల వారిని ప్రోత్సహించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను తమ స్టాండర్డ్ ఓటు బ్యాంక్ గా మలుచుకుంది. కానీ ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ఆవిర్భావించాక.. ఉమ్మడి ఏపీలో 275 నియోజకవర్గాల్లో సగానికి పైగా బీసీ నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. వారిని గెలిపించుకుంది. వారికి రాజకీయ జీవితం కల్పించింది. అయితే ఇది యాదృశ్చికంగా జరిగిందో.. లేక ప్రీ ప్లాన్ గా జరిగిందో తెలియదు కానీ.. రాష్ట్రంలోని బీసీ వర్గాలంతా టీడీపీ గూటికి చేరారు. ఆ పార్టీని ఓన్ చేసుకున్నారు. మిగతా సామాజికవర్గాలు తిరస్కరించినా. .. బీసీ వర్గాలు మాత్రం అంటిపెట్టుకుంటూ వచ్చారు. కానీ 2004 తరువాత పరిస్థితి మారిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ తారక మంత్రం బీసీలపై బాగానే వర్కవుట్ అయ్యింది. దీంతో వారు యూటర్న్ తీసుకోవడం ప్రారంభించారు. వైఎస్ నిర్ణయాలు ఆయన కుమారుడు జగన్ కు లభ్ధి చేకూర్చాయి. అటు చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం, జగన్ బీసీ జపం ఆలపించడంతో బీసీల్లో కొన్ని వర్గాలు జగన్ వైపు మళ్లాయి. 2014 ఎన్నికల్లో కొంతవరకూ…2019 ఎన్నికల్లో పూర్తిగా టర్న్ కావడంతో సంపూర్ణ విజయం దక్కించుకుంది.

జగన్ వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో ఓటువేసిన బీసీలకు గత మూడున్నరేళ్లుగా ఎటువంటి ప్రయోజనాలు లేవు. అన్నీ నవరత్నాల్లోనే లబ్ధి చూపించి మీకు ఇంత ఇచ్చాము అన్న గణాంకాలే తప్ప ప్రత్యేక పథకమూ లేదు.. రాయితీలు లేవు.. చివరకు బ్యాంకు రుణాలు అందడం లేదు. వందకు పైగా కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా.. వాటికి విధులూ కానీ.. నిధులు కానీ కేటాయించలేదు. కేవలం అవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోగా.. వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు కొలువులుగా మారాయి. ఆయా వర్గాల్లో నిరుద్యోగులకు పైసా విదిల్చని ప్రభుత్వం .. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పాలకవర్గాలకు మాత్రం ఠంచనుగా జీతాలు చెల్లిస్తోంది. పైగా దర్పం చెలాయించేందుకు కారు, ఇతర అలవెన్స్ లు కల్పిస్తుండడంతో రాజబోగం అనుభవిస్తున్నారు. కానీ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారు. అయితే ఈ పరిణామ క్రమంలో బీసీ వర్గాల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఇది కాస్తాపెరిగి పెద్దదయితే తమకు లాస్ తప్పదని భావించిన జగన్ సర్కారు జయహో బీసీ గర్జనకు పిలుపునిచ్చింది,

Jayaho BC Sabha
Jayaho BC Sabha

అయితే ఇక్కడ ఒకటి మాత్రం చెప్పగలం. బీసీలు అన్న మాట ఒక గుర్తింపు కోసమే అన్న విషయం గుర్తించుకోవాలి. బీసీల్లో వంద వరకూ కులాలు ఉన్నాయి. కానీ అందులో కూడా ఆధిపత్యం కొన్ని కులాలదే. అవి కూడా వేలు పెట్టి లెక్కించవచ్చు. రాష్ట్రంలో ఒక్క నాయీ బ్రాహ్మణుడు కానీ.. విశ్వబ్రాహ్మణుడు కానీ.. రజకుడు కానీ ఎమ్మెల్యే అయ్యారంటే చెప్పలేని పొజిషన్ మనది.అటువంటప్పుడు ఈ గర్జనలెందుకు? పొలికేకలు ఎందుకు? అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. కానీ రాజకీయ పార్టీలు అన్నాక సమీకరణలు మార్చుకోవడానికి ఏవేవో చేస్తుంటాయి. ఎంతగానో ప్రయత్నిస్తుంటాయి. ఈక్రమంలోనే వైసీపీ సర్కారు బీసీ గర్జనకు పిలుపునిచ్చి ఉండవచ్చు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఇది ఏమంత వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version