
ఏపీకి రాజధానిగా ఏది బెస్ట్.. అమరావతినా? లేక విశాఖనా? ఈ రెండు ప్రాంతాల విషయంలో ఏపీ మొత్తం విడిపోయింది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి దానికే ప్రజా మద్దతు ఉందని వైసీపీ చెబుతోంది. ఇక అమరావతియే ఏపీ రాజధాని అని.. దానికే ప్రజల మద్దతు ఉందని టీడీపీ అంటోంది. మరి నాయకులంతా విడిపోయిన ఈ విషయంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజా మద్దతు ఎవరికుందనేది ఆసక్తిగా మారింది. సో ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు.
మూడు రాజధానుల వ్యవహారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.. వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు ఇక్కడి ప్రజలు అనుకూలమని.. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని తాజాగా డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మానా కృష్ణదాస్ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసరడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. ఈ సవాల్ పై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడో ఎందుకు విశాఖ పార్లమెంట్ స్థానంలోనే ఉప ఎన్నిక పెడుదామని.. ఉప ఎన్నికలకు వైసీపీ రెడీ అంటూ ప్రతిసవాల్ విసిరారు.
రాజధాని అంశంపై విశాఖ ఎంపీ సీటులో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామని రెఫరెండానికి రెండు పార్టీలు సవాళ్లు చేసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయ్యన్న వర్సెస్ మంత్రి ధర్మానా వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాజధానిపై గతంలో చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళుదామంటే సీఎం జగన్ పారిపోయాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఇప్పుడైనా విశాఖ లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికకు వెళ్తే ప్రజలే తేలుస్తారని అయ్యన్న పేర్కొన్నారు.
ఈ ఇద్దరు నేతలు విశాఖను రాజధానిగా కొనసాగించాలా? వద్దా అంటూ రెఫరెండానికి పట్టుబడడం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ క్రమంలోనే నిజంగా ప్రజలకే ఈ నిర్ణయాన్ని వదిలేస్తే ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆది నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టు ఉంది.ఇక్కడ వైఎస్ విజయమ్మను కూడా ఓడించారు ప్రజలు. కానీ పోయినసారి వైసీపీ గెలిచింది.ఈ క్రమంలోనే రాజధానిపై విశాఖలో రెఫరెండం నిర్వహిస్తే ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.