Who Will Win AP Elections: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా పట్టుమని రెండేళ్లు కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏడాది అనే చెప్పుకోవచ్చు. చివరి సంవత్సరం అంతా ఎన్నికల ఫీవర్ లోకి వెళ్లిపోతోంది. నేతలు సేఫ్ జోన్ కు ఆరాటపడే సమయమది. అందుకే చివరి ఏడాదికి పాలన కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు ముందస్తు ఎన్నికల ఊహాగానాలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కాకపోయినా ఆరు నెలల ముందగానైనా జగన్ ముందస్తుకు వెళతారని టాక్ నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలు, పాలనా భారంతో తప్పకుండా నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలుపెవరిది? అన్న చర్చ తెలుగునాట ప్రారంభమైంది. ఒకవైపు అధికార పక్షం, మరోవైపు విపక్షం పదును పెంచాయి. ప్రజల మధ్యలో గడపాలని నిర్ణయించుకున్నాయి. అయితే గతంలో లేని విధంగా జగన్ ప్రభుత్వంలో ఓకింత కలవరపాటు ప్రారంభమైంది. సీఎం జగన్ సమావేశాలకు ప్రజలు ముఖం చాటేయడం, అధికారికంగా చేపడుతున్న గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలని చూడకుండా సమస్యలపై నిలదీస్తున్నారు. చుక్కలు చూపిస్తున్నారు. ధరల పెరుగుదల, పన్నుల బాదుడు వంటి వాటిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సంక్షేమం మాటున డబ్బులు పంచుతున్నా..ధరలు, పన్నుల రూపంలో పిండేస్తున్నారన్న వాస్తవాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకోవడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఆదిలోనే దీనికి విరుగుడు చర్యలు ప్రారంభించాలని.. వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వివరించాలని జగన్ ఆదేశించారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు ప్రజల మధ్యకు వెళుతున్న ప్రజాప్రతినిధులకు పరాభవం తప్పడం లేదు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులతో సామాజిక కోణంలో బస్సు యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు.
పాలనలో వెనుకబాటు..
జగన్ ముచ్చటగా మూడో ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత గడిచిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు దూరమయ్యారు. వారి జీతభత్యాలు, పీఆర్సీ ప్రయోజనాలు కల్పించడంలో విఫలమయ్యారు. సీపీఎస్ రద్దు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో వారి ముందు చులకనయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు వర్గాల మద్దతు చాలా కష్టం. మరోవైపు రాష్ట్రానికి రాజధాని లేకుండా నడి రోడ్డున నిలబెట్టారని మేథావులు, రాజకీయ పరిణితి ఉన్నవారు ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేయడంతో పాటు మూడు రాజధానులంటూ జగన్ సర్కారు చేసిన హడావుడి ప్రజల్లో అయోమయానికి, గందరగోళాన్ని స్రుష్టించింది. మూడేళ్ల పాలన పూర్తయినా రాజధాని అంశం కొలిక్కి తీసుకురాకపోవడం జగన్ కు మైనస్సే. అదరాబాదరాగా తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల పరిస్థితులకు దారితీస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎవరో ఒకరు కోర్టు లకు వెళ్లడం, ఆ తర్వాతి పరిణామాలు అనేక మలుపులు తిరగడం జరుగుతూనే ఉంది జగన్ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్న విపక్షాల మాటలు ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరుతున్నాయి. జగ మొండిగా పేరుపొందిన జగన్ మాత్రం వీనికి వెరవడం లేదు.నేను ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చాను.. వాటిని తీర్చేందుకు ఎందాకైనా వెళతానన్న మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పటివరకూ వలంటీర్ల రూపంలో సొంత పార్టీ మనుషులకు, సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగలిగారు. అయితే సచివాలయ ఉద్యోగులు నియమితులై మూడేళ్లు సమీపిస్తున్న వారికి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించలేదు. దీంతో వారిలో కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్థిక తిరోగమన దిశలో ఏపీ ప్రయాణిస్తుందన్న వార్తలు, విపక్షాల ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించే వారు మాత్రం జగన్ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. సంక్షేమ రుచి చూసిన వారు మాత్రం రాష్ట్రం ఎటు వెళ్లిపోతే మనకేంటి? మనకు లబ్ధి చేకూరుతుంది కదా అని సంత్రుప్తి చెందుతున్నారు. అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలేదు. సమర్థించడం లేదు.
చంద్రబాబు అస్త్ర శస్త్రాలు..
మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. గడిచిన ఎన్నికల్లో దారుణ ఓటమితో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కొంతమంది అధికార పార్టీ ఒత్తిడితో వైసీపీలో చేరిపోయారు. చాలామంది సైలెంట్ అయిపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నాయకులు, కార్యకర్తలు యాక్టివ్ అవుతున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ తో చంద్రబాబు వెబ్ మీట్లకే పరిమితమయ్యారు. మూడో ఏడాది నుంచే నాయకులు, కార్యకర్తల మధ్యకు వస్తున్నారు. వారిని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, పన్నులు, చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం ఆ పార్టీకి మైలేజే. నాయకులు, కార్యకర్తలు యాక్టివ్ అయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి చలనం వచ్చింది. చంద్రబాబు కూడా వయోభారం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలియ తిరుగుతున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల సమీక్ష మొదలు పెట్టేశారు. గతానికి భిన్నంగా ముందే కేండిడేట్లను డిక్లేర్ చేస్తున్నారు. రెండేళ్ల పాటు వారు పనిచేసుకునేలా స్వేచ్చనిస్తున్నారు. ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. పొత్తుల ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు జనసేన, బీజేపీతో కూటమి కట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకుగాను త్యాగాలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా.
Also Read: Junior NTR- Chandrababu: చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ భయం.. బర్త్‌డే శుభాకాంక్షలు కూడా చెప్పరా!?
పవన్ ‘కీ’రోల్
ఏపీలో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలిచారు. పార్టీ ఆవిర్భవించిన సుదీర్ఘ విరామం తరువాత ఆయన కీ రోల్ ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. నిర్థిష్టమైన ఓటు బ్యాంకుతో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ప్రజలకు సైతం ప్రత్యామ్నాయంగా మారారు. ఆయన అవసరం ప్రధాన విపక్షానికి ఉంది. ఆయనను అడ్డుకునే పనిలో అధికార పక్షం పడింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లోనే పవన్ ప్రభావం చూపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి కూటమికి మద్దతిచ్చి వారి గెలుపునకు దోహదం చేశారు. క్లీన్ ఇమేజ్ ఉండడం పవన్ కల్యాణ్ కు ప్లస్ గా మారింది. ఫక్తు రాజకీయాలు చేయకుండా.. ప్రజా సమస్యలు పరమావధిగా ఆయన చేస్తున్న క్రుషిని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తించడం ప్రారంభించారు. అందుకే బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.30 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు యాత్రం చేపడుతున్నారు. పవన్ కు పెరిగిన ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకొని చంద్రబాబు పొత్తుకు ముందుకొస్తున్నారు. అదే సమయంలో వారి మధ్య పొత్తును అణచివేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మారాలని బీజేపీ భావిస్తోంది. తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శిస్తోంది. అటు అధికార వైసీపీ, ఇటు విపక్ష టీడీపీకి సమాన దూరం పాటిస్తోంది. జనసేనతో కలిసి నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూటమిగా వెళ్లాలనుకుంటే జనసేనతో మాత్రమే వేళతామని పార్టీ రాష్ట్ర నాయకత్వం కుండబద్దలు కొట్టి చెబుతోంది. పక్కా కాన్ఫిడెన్స్ తోనే బీజేపీ మాట చెబుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాకు పొత్తు ఉంటే జనసేనతో మాత్రమేనంటూ తేల్చిచెబుతోంది. అటు పార్టీ బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎవరికి వారుగా ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు రూపొందించుకుంటున్నారు.
Also Read: Bigg Boss Nonstop Bindu Madhavi: బిగ్ బాస్ విజేత అయ్యాక బిందుమాధవి కామెంట్స్ వైరల్
Recommended Videos:
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Who will win the elections in ap now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com