
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజూరాబాద్ సమరం ఎంతటి కీలకమో అందరికీ తెలిసిందే. ఇంకా.. చెప్పాలంటే ఇప్పటి వరకూ ఈ తరహా బై పోల్ ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి. తన కంచుకోటపై మళ్లీ జెండా ఎగరేసి తానేనని ఈటల ధీమా వ్యక్తం చేస్తుండగా.. దాన్ని బద్ధలు కొట్టేస్తామని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈటలకు స్వతహాగా ఉన్న ఇమేజ్ కు బీజేపీ బలం కూడా తోడవడంతో పోరు రసవత్తరంగా సాగనుందనే విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు.
అయితే.. ఎవరి ప్రయత్నాలు మాత్రం వారు తీవ్రంగా కొనసాగిస్తున్నారు. బీజేపీ వర్గం దాదాపుగా హుజూరాబాద్ లో వాలిపోయింది. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈటల గెలుపును నిచ్చెనగా వాడుకొని, రాజకీయ వైకుంఠపాళిలో గండాలను తప్పించుకొని, ఒకేసారి అధికార పీఠం అందుకోవాలని ఆశిస్తోంది బీజేపీ. 2023లో రాబోయే ఎన్నికలకు.. హుజూరాబాద్ నుంచే విజయనాదం చేయాలని పట్టుదలగా ఉంది. అందుకే.. ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది కమలదళం.
అటు టీఆర్ఎస్ కండీషన్ గురించి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉంది. 2023లో హ్యాట్రిక్ విజయం అనేది అంత సునాయాసం కాదు. సహజ వ్యతిరేకతకు తోడు.. విపక్షాలు కూడా బలం పుంజుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో.. కాంగ్రెస్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత బలపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇటు షర్మిల తాను సైతం ఉన్నానంటూ వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. గులాబీ దళం అత్యంత కట్టుదిట్టంగా ఎన్నికల పోరులో నిలవాల్సి ఉంటుంది.
అలా జరగాలంటే.. ఇప్పుడు హుజూరాబాద్ లో గెలవడం ఖచ్చితంగా అవసరం. గెలిస్తే.. తమకు తిరుగులేదని ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు తమవైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవచ్చు. కానీ.. ఈటల గెలిస్తే మాత్రం.. ఈ మాటలన్నీ బీజేపీ చెప్పుకుంటుంది. అది గులాబీ పార్టీకి పెద్ద దెబ్బే అవుతుంది. అందుకే.. కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీనికోసం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండా.. టీఆర్ఎస్ గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఈటల ఇన్నాళ్లూ గెలిచింది గులాబీ పార్టీ గుర్తు మీదనే అనీ.. ఇదే విషయాన్ని జనాలకు చెప్పాలని భావిస్తున్నారట. అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే.. ఈటలతో కంపేర్ చేసే ఛాన్స్ ఉంటుందని, అందువల్ల టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్నట్టుగానే ముందుకు సాగాలని కేసీఆర్ నిర్ణయించారట. మరి, ఈ పాచిక ఎంత వరకు పారుతుంది? ప్రజలు ఎటువైపు ఉన్నారు? అనేది చూడాలి.