Arvind Kejriwal : వాస్తవానికి మనదేశంలో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. జైలు శిక్ష అనుభవించి.. మళ్లీ పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో విపరీతమైన చర్చ జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రివాల్ ఏర్పాటుచేసిన పార్టీపై అలాంటి మరక పడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తనపై పడిన అవినీతి మరకను తుడుచుకోవడం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకున్నంత సులభం కాదు. అందువల్లే ప్రజల్లో తను కోల్పోయిన ఇమేజ్ తిరిగి సాధించడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల్లో భావోద్వేగాలు రగిలించడానికి రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారు. ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మాత్రమే కాదు.. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో అరెస్ట్ అయిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోరు.
అరవింద్ స్థానంలో ఎవరు..
అరవింద్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చుంటారనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. అయితే అరవింద్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రులు అతిశి, గోపాల్ రాయ్, కైలాస్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. సునీత కూడా అరవింద్ కేజ్రీవాల్ లాగానే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఆమెకు పరిపాలన పట్ల అవగాహన ఉంది. ఒకవేళ సునీత గనుక ముఖ్యమంత్రి అయితే అరవింద్ నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే వారసత్వ రాజకీయాలపై అరవింద్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సునీతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టబోరని వార్తలు వినిపిస్తున్నాయి.
వీరి పేర్లు కూడా పరిగణలోకి..
మంత్రి అతిశీ.. అరవింద్ కేజ్రివాల్ జైల్లో ఉన్నప్పుడు పరిపాలన బాధ్యతలు మొత్తం ఆమె చూసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ, విద్యాశాఖను ఆమె పర్యవేక్షిస్తున్నారు. నేపథ్యంలో ఆమెను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు స్వాతంత్ర వేడుకల్లో ఆమె ముఖ్యమంత్రి తరఫున జాతీయ జెండా ఎగరేశారు. అందువల్ల ఆమెకే తదుపరి ముఖ్యమంత్రి పదవిని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే ముఖ్యమంత్రి రేసులో మరో పేరు కూడా వినిపిస్తోంది. అతనే సౌరభ్ భరద్వాజ్. గ్రేటర్ కైలాష్ నియోజవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అరవింద్ ఏర్పాటుచేసిన మొదటి 49 రోజుల ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. తరచూ మీడియా సమావేశంలో పాల్గొంటాడు. టీవీ డిబేట్ లలో తన వాదన వినిపిస్తాడు. ఒకవేళ అతిశీ ని వద్దనుకుంటే సౌరభ్ కు ముఖ్యమంత్రి స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పరిణితి చోప్రా భర్త సైతం..
ఆప్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దాకు కూడా సీఎం పదవి అప్పగించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీలో సభ్యుడిగా లేనివారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంది.. కానీ ఆరు నెలల్లో శాసనసభ్యుడిగా లేదా శాసనమండలి సభ్యుడిగా ఆయన ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం పదవీకాలం కూడా ఆరు నెలలు మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఈ సాంకేతిక అంశం రాఘవ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అడ్డం కాదు. అన్నట్టు ఈ రాఘవ మరెవరో కాదు.. బాలీవుడ్ నటి పరిణితి చోప్రా భర్త. ఇక వీరితో పాటు రాష్ట్ర మంత్రి కైలాస్ గేహ్లాట్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అయితే సంజయ్ సింగ్ మద్యం విధానంలో నిందితుడిగా ఉన్నాడు. ఆయన కూడా జైలు పాలై.. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.