ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎలాగైనా మంత్రి పదవి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో పదవి దక్కని వారంతా ఈ సారి కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కేబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధమనుకుంటున్న తరుణంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం జగన్ తన మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు సమాచారం.

తొలిసారి కేబినెట్ లో స్థానం దక్కని వారు ఈసారి ఖాయమనే దీమాలో ఉన్నారు. దసరా సమయంలో విస్తరణ ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంటిలిజెన్స్, సర్వే నివేదికల ఆధారంగా పదవులు దక్కవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పదవులపై ఆశలు పెంచుకున్న వారికి పదవులపై ఆశలు భారీగానే పెట్టుకున్నారు.
ఇక శ్రీకాకుళం నుంచి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తుండగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు బెర్త్ ఖాయమని తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో పీడిక రాజన్నదొర, కొలగట్టు వీరభద్రస్వామి పదవులు ఆశిస్తున్నారు. విశాఖ నుంచి గుడివాడ అమర్ నాథ్, కరణం పద్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేశ్ మంత్రి పదవులు కోరుతున్నారు. గిరిజనులకు మంత్రి ఇవ్వాల్సి వస్తే ఫాల్గుణ, కె. భాగ్యలక్ష్మి లు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా, కన్నబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. ఎస్టీ కోటాలో నాగులపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో క్షత్రియ, కాపు, ఎస్సీ సామాజిక వర్గాలు పదవులు ఆశిస్తున్నాయి. ఇందులో క్షత్రియ నుంచి ముదునూరి ప్రసాదరాజు, కాపు నుంచి కొట్టు సత్యనారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్, ఎస్సీ నుంచి తలారి పేర్లు ఉన్నాయి.
కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారధి ఆశిస్తున్నారు. ఒకవేళ కమ్మ వర్గానికి స్థానం కల్పిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ కు చాన్స్ దక్కనుందని తెలుస్తోంది. సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, మేక వెంకట ప్రతాప అప్పారావు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డికి స్థానం ఖాయమని సమాచారం.
ఇక నెల్లూరు జిల్లా నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎస్సీ కోటాలో కిలినేటి సంజీవయ్య ముందంజలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆశిస్తున్నారు. కడప నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సి.రామచంద్రయ్య కూడా వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రతాపరెడ్డి ఉన్నా మహిళా కోటాలో ఉషశ్రీకరణ్, జనులగడ్డ పద్మావతి, ఎస్సీ కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు.
కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, పోటీలో ఉన్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతీయతలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం దక్కనుందో తెలియాల్సి ఉంది. జగన్ మదిలో ఎవరికి ప్రాధాన్యం ఉందో తెలియడం లేదు. దీంతో అందరు ఆశించినా అందులో ఎవరికో పదవి దక్కే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.