TDP And Janasena: టిడిపి,జనసేన కూటమిలో ఉండేది ఎవరు? పవన్ కోరుతున్నట్లు బిజెపి కలిసి రానుందా? లేకుంటే కామ్రేడ్లు తెరపైకి రానున్నారా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. టిడిపితో కలిసి నడవనున్నట్లు పవన్ ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీలపై స్పష్టత వచ్చింది. అదే సమయంలో వారితో కలిసేందుకు వామపక్షాలు ఆసక్తి చూపుతున్నాయి.తద్వారా ఇండియా కూటమి పేరుతో జగన్ తో పాటు బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు తరువాత వామపక్షాల నాయకులు శరవేగంగా పావులు కదిపారు. సిపిఐ అగ్రనేత నారాయణ, సిపిఎం నేత రాఘవులు గట్టిగానే స్పందించారు. నారాయణ అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. లోకేష్ కు ధైర్యం చెప్పి వచ్చారు. అయితే ఆ స్థాయిలో బీజేపీ నుంచి స్పందన లేదు. పురందేశ్వరి స్పందించినా.. అది బంధుత్వం అని తేలింది. బిజెపి పరంగా చంద్రబాబుకు ఎటువంటి స్వాంతన లేకుండా పోయింది. కానీ కామ్రేడ్లు మాత్రం చాలా ఫాస్ట్ గా స్పందించారు. చంద్రబాబు అరెస్టును ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు.
రాష్ట్రంలో బిజెపి బలం కంటే వామపక్షాల బలం అధికం. దీనికి అనేక రకాల గణాంకాలు ఉన్నాయి. ప్రజాసంఘాల మద్దతు వామపక్షాలకు ఉంటుంది. ఈ పార్టీలకు అనుబంధంగానే ప్రజాసంఘాలు పనిచేస్తుంటాయి. ఉద్యోగ, కార్మిక, కర్షక రంగాలతో వారికి మంచి సంబంధాలే ఉంటాయి. ఒకవేళ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఓట్ల బదలాయింపు సులువుగా జరుగుతుంది. అటు సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా మడత పేచీ రాదు. బిజెపి తీరులో మార్పు రాకుంటే మాత్రం చంద్రబాబు, పవన్ లు తమ కూటమిలోకి వామపక్షాలను చేర్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి కీలకం. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందనున్నాయి. దీనికి వైసీపీ సహకారం అవసరం. అందుకే ఈ పార్లమెంటు సమావేశాల అనంతరం బిజెపి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దలు గుంభనంగా ఉండడాన్ని మాత్రం టిడిపి క్యాడర్ తట్టుకోలేకపోతోంది. అయితే పవన్ నోటి నుంచి పదేపదే బిజెపి మాట వస్తుండడంతో టిడిపి మౌనం దాల్చాల్సి వస్తుంది. అయితే బిజెపి ఇప్పటి లాగానే వైసీపీకి సహకరిస్తే మాత్రం.. పవన్ పునరాలోచనలో పడే అవకాశం ఉంది.వామపక్షాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురుకానుంది.