YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్ రెడ్డి ఎవరు..ఆయన చరిత్ర ఏంటి

YS Bhaskar Reddy: వివేకా హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరు? జగన్ తో వారికి ఉన్న చుట్టరికం ఏమిటి? జగన్ వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కుటుంబ కంటే వారినే ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? బాబాయ్ కుమార్తె సునీతకు అండగా నిలబడకుండా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అసలు వైఎస్ కుటుంబంలో […]

Written By: Dharma, Updated On : April 18, 2023 1:07 pm
Follow us on

YS Bhaskar Reddy

YS Bhaskar Reddy: వివేకా హత్యకేసులో అరెస్టయిన వైఎస్ భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరు? జగన్ తో వారికి ఉన్న చుట్టరికం ఏమిటి? జగన్ వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కుటుంబ కంటే వారినే ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? బాబాయ్ కుమార్తె సునీతకు అండగా నిలబడకుండా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందన్నదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టులు, బెయిల్ పిటీషన్లు, విచారణ నేపథ్యంలో మీడియా నుంచి సామాన్య ప్రజల వరకూ ఇదే చర్చ నడుస్తోంది.

కడపలో తెర వెనుక రాజకీయం…
వైఎస్ భాస్కరరెడ్డి.. ఈ పేరు పెద్దగా వినిపించిన దాఖలాలు లేవు. కానీ పులివెందుల అసెంబ్లీతో పాటు కడప లోక్ సభ స్థానం పరిధిలో రాజకీయాలు శాసించేది భాస్కరరెడ్డే. తెర ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు.. కానీ తెర వెనుక మాత్రం భాస్కరరెడ్డే ఉండేవారు. అంటే రాజశేఖర్ రెడ్డి ఏలుబడికి భాస్కరరెడ్డి వెనుక ఉండి చేయూతనందించేవారు అన్న మాట. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం మాత్రమే వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ పులివెందులకు షిఫ్ట్ కావడంతో అవినాష్ రెడ్డి తెరపైకి వచ్చారు. వివేకానందరెడ్డి ఎంపీ సీటును ఆశించడం, అదే సమయంలో అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడం.. ఆ తరువాత వివేకా హత్య కావడం.. దాని వెనుక రాజకీయ కారణాలు బయటకు వచ్చాయి. వైఎస్ భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు అవినాష్ రెడ్డిని నిందితులుగా సీబీఐ పేర్కొనడం వెనుక కూడా రాజకీయ కుట్రనే ప్రధానంగా చూపిన విషయం తెలిసిందే.

రెండు వైపులా చుట్టరికాలు..
వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి.. సీఎంజగన్ సతీమణి భారతికి సొంత మేనమామ. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి స్వయాన సోదరుడు. అంతేకాదు.. భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీ కూడా భారతికి మేనత్త అవుతారు. భారతి తండ్రి గంగిరెడ్డి సోదరే లక్ష్మీ. వీరు కుండ మార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రాథమికంగా బంధుత్వం ఇది. కానీ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ కుటుంబం గురించి సమగ్రమైన వివరాలు అందించారు. సీఎం జగన్ ముత్తాత, రాజశేఖర్ రెడ్డి తాత వెంకటర్ రెడ్డి. ఈయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య లక్ష్మమ్మ కొడుకు చిన్న కొండారెడ్డి. వీరికి తొమ్మిది మంది సంతానం. అందులో తొమ్మిదో కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి.
ఆరో కుమార్తె సుగణమ్మ. ఈమె జగన్ భార్య భారతి తల్లి. ఇక వెంకట్ రెడ్డి రెండో భార్య మంగమ్మ అయిదో కొడుకు వైఎస్ రాజారెడ్డి. రాజారెడ్డికి ఇద్దరు కొడుకులు వారిలో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇంకొకరు వైఎస్ వివేకానందరెడ్డి. ఇది వైఎస్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకిచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు.

YS Bhaskar Reddy

రాజారెడ్డి తరువాత అన్నీతానై..
వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి ఉన్నంతవరకూ ఆయన కనుసన్నల్లో నడిచేది. కడప జిల్లా రాజకీయాలను శాసించే వారు. ఎప్పుడైతే రాజారెడ్డి హత్య జరిగిందో.. నాటి నుంచి భాస్కరరెడ్డి అన్ని బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలను నడిపేవారు. తెర వెనుక తతంగం మొత్తం భాస్కరరెడ్డి చూసుకునేవారు. కుటుంబాలు ఐక్యతగా ఉండేవి. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం భాస్కరరెడ్డి జగన్ వెంట నడిచారు. అండగా నిలబడ్డారు. వివేకా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ కడప ఎంపీ సీటు వదులుకొని పులివెందుల అసెంబ్లీ సీటుకు మారగా.. అవినాష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సీటు షర్మిళకు కానీ.. తనకు కానీ ఇవ్వాలని వివేకా కోరినట్టు వార్తలు వచ్చాయి. వివేకా హత్య కు కడప ఎంపీ సీటుకు లింకులున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే ఆది నుంచి తన రాజకీయ జీవితానికి, కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారన్న అభిమానం ఒకవైపు, భారతి రూపంలో దగ్గర బంధువు అన్న కోణంలో మరోవైపు జగన్ భాస్కరరెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి అండగా నిలిచి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.