Vangaveeti Mohana Ranga: ఒక నగరంపై పట్టు కోసం జరిగిన ఆధిపత్య పోరాటం.. తరువాత కుటుంబాల మధ్య వైరంగా మారింది. ఆ తరువాత కులాల మధ్య పోరాటంగా మారింది. అది రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఆయనే వంగవీటి మోహన్ రంగా. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ నేలను విడిచి మూడు దశాబ్దాలు దాటినా ఆ స్పూర్తి ఇంకా రగులుతునే ఉంది. సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహన్ రంగా పేరు వినిపిస్తునే ఉంది. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా.. ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారినా.. వంగవీటి మోహన్ రంగా చరిత్ర మాత్రం సజీవంగా ఉండడం ఆయన పోరాట పటిమ తెలియజేస్తోంది. ఎమ్మెల్యేగా మూడున్నరేళ్ల పాటు పదవి చేపట్టినా.. ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్థంచేసుకోవచ్చు. జూలై 4 వంగవీటి మోహన్ రంగా జయంతి.
విజయవాడ కేంద్రంగా..
1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో బెజవాడ ప్రధాన వాణిజ్య కేంద్రం. ఏపీ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం. హేమాహేమీలను జాతికి అందించిన నగరం. రాజకీయ యవనికపై రాణించిన నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. ఆ సమయంలో విజయవాడలో వామపక్ష భావజాలం అధికం. ఆటో, రిక్షా, లారీ..ఇలా అన్నిరకాల ట్రేడ్ యూనియన్లు చాలా యాక్టివ్ గా పనిచేసేవి. విద్యార్థి సంఘాలు కూడా విజయవాడ కేంద్రంగా క్రియాశీలకంగా ఉండేవి. అటువంటి సమయంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటికే చలసాని రత్నం నగరంపై పట్టున్న వ్యక్తి. ఆపై వామపక్షాల నాయకుడిగా ఉన్నారు. అటువంటి సమయంలో వంగవీటి సోదరులు తెరపైకి వచ్చారు. చలసాని రత్నం అనుచరులుగా మారారు. వంగవీటి రాధా ట్రేడ్ యూనియన్ లో కీలకంగా ఎదిగారు. స్వతంత్రంగా పనిచేశారు. దీంతో చలసాని రత్నంతో వంగవీటి సోదరులకు విభేదాలొచ్చాయి. దాదాపు విజయవాడలోని ట్రేడ్ యూనియన్లన్నీ రాధా గూటికి చేరాయి. వంగవీటి సోదరులు యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. విజయవాడ నగరంలో ఈ సంఘం కార్యకలాపాలు పెరిగాయి. నగరం దాటి విస్తరించబడ్డాయి. అయితే వంగవీటి సోదరుల ఆధిపత్యం మింగుడుపడని చలసాని రత్నం వంగవీటి రాధాను దారుణంగా హత్య చేయించడంతో సోదరుడి బాధ్యతను వంగవీటి మోహన్ రంగా తీసుకున్నారు. తదనంతరం చలసాని రత్నం హత్యకు గురికావడం జరిగిపోయింది. అక్కడితో వర్గ పోరుకు తెరపడిందని అంతా భావించారు.
Also Read: Uddhav Thackeray Resigns: మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్.. ప్రజల్లోకి పాదయాత్రగా ఉద్దవ్ ఠాక్రే
రాజకీయ వైరంగా..
దేవినేని గాంధీ, నెహ్రూ సోదరులు వంగవీటి కుటుంబంతో కలిసి నడిచే వారు. యునైటెడ్ ఇండిపెండెట్స్ స్టూడెంట్ యూనియన్ లో యాక్టివ్ గా పనిచేసేవారు. తదనంతర క్రమంలో వారు విడిపోయి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట వేరే కుంపటి పెట్టారు. తమ ప్రాభల్యం పెంచుకునే క్రమంలో వంగవీటి మోహన్ రంగాతో విభేదాలు పెంచుకున్నారు. దీంతో విజయవాడలో మరోసారి ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అయితే రంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ నగరం నుంచి ఎన్నికయ్యారు. అదే సమయంలో దేవినేని గాంధీ కంకిపాడు నుంచి గెలుపొందారు.
ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగానే ఉండేవారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం తహతహలాడేవారు. అటువంటి సమయంలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సామాజికవర్గం ద్రుష్ట్యా దేవినేని సోదరులు టీడీపీ గూటికి చేరారు. తాను అధికారంలో లేకపోయిన కాపులు, అణగారిన వర్గాలకు మోహన్ రంగా అండగా నిలిచేవారు. వారు ఏ చిన్నసాయం కోరినా చేసేవారు. దీంతో ఆ వర్గాల్లో రంగాకు పట్టు పెరిగింది. కాపునాడును స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంత తరువాత రాజకీయంగా అణగదొక్కబడిన కాపులంతా రంగా వైపు చూడడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల కోసం నడిరోడ్డులో మోహన్ రంగా దీక్షకు దిగారు. సరిగ్గా 1988 డిసెంబరు 26న దారుణ హత్యకు గురయ్యారు. ఆ యోధుడు నేలకొరిగినా.. ఆయన ఇచ్చిన స్పూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. కాపులు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన పరితపించారు. సమాజంలో ఒకటి, రెండు శాతం ఉన్న కమ్మ, రెడ్డిల ఆధిపత్యాన్ని సహించలేకపోయారు.
రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తరుణంలో అసువులు బాశారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు ఆయన్ను తమ సొంతవాడి అక్కున చేర్చుకుంటున్నాయి. కానీ ఆయన ఆశయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న కొత్త జిల్లాల ఆవిర్భావ సమయంలో కూడా ఆయన పేరును ఏ జిల్లాకూ పెట్టలేదు. ఇతర సామాజికవర్గాల నాయకుల జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నా రంగాకు మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. ప్రభుత్వాలైతే గుర్తించలేదు.. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ రంగా సేవలను తమ మనసులో పదిలపరుచుకున్నారు.
Also Read:Hoardings Against PM Modi: సాలు మోడీ. సంపకు మోడీ ఫ్లెక్సీల ఏర్పాటుతో కమలంలో కలకలం?