Tiger Nageswara Rao Real Story : స్టువర్టుపురం దొంగల గురించి ఒకప్పుడు కథలుగా చెప్పేవారు. టైగర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాల్లో ఈ దొంగల ముఠా చెలరేగిన ఉదంతాలు గురించి కోకొల్లలుగా చెప్పేవారు. అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరు..? స్టువర్టుపురం దొంగల కథేంటో..? చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టు పురానికి చెందిన గరిక నాగేశ్వరరావు అనే ఒక దొంగను టైగర్ అని, ఆంధ్ర రాబిన్ హుడ్ అని కొందరు చెబుతుంటారు. దొంగతనాలు చేసే ఈ వ్యక్తి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒరిస్సా వంటి రాష్ట్రాల్లోనూ ఫేమస్. దొంగతనాలు, నేర ఆరోపణల్లో ఈయన పేరు ఉండేది. అయితే అటువంటి వ్యక్తి పేరు మీద ఇప్పుడు తెలుగు సినిమా వస్తుండడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏకంగా టైగర్ నాగేశ్వరరావు పేరుతో రవితేజ హీరోగా బయోపిక్ రాబోతోంది. ఇంతకీ ఒక దొంగకు రాబిన్ హుడ్ అని పేరు ఎలా వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు గా గరిక నాగేశ్వరరావు ఎదిగిన క్రమం అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది.
-ముగ్గురు అన్నదమ్ములు..
టైగర్ నాగేశ్వరరావు పై కొంపల్లే సుందర్ అనే పరిశోధకుడు పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో అనేక కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు గా పేరుగాంచిన ఆయన అసలు పేరు గరిక నాగేశ్వరరావు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. నాగేశ్వరరావుకు అన్నయ్య ప్రభాకర్, తమ్ముడు ప్రసాద్ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమను కనీసం ప్రజలు పట్టించుకోలేదని, మనుషులుగా కూడా గుర్తించలేదన్న భావనతో దొంగతనాలను ప్రారంభించారు. దేశం మనిషిగాను గుర్తించే ప్రయత్నం చేయకపోవడంతో నేర ప్రవృత్తిని ఎంచుకొని ఆ బాటలో కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒరిస్సా, చతిష్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో వీరు ముఠా పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడేది. ఆయా రాష్ట్రాల్లో వీరుపై తీవ్రమైన నేరారోపనలతో పాటు దొంగతనాలు కేసులు నమోదయ్యాయి. 1973 లో బనగానపల్లి చేసిన దొంగతనం సంచలనంగా మారింది.
-మార్పు తీసుకువచ్చే ప్రయత్నం..
స్టువర్టుపురం దొంగలుగా అప్పటికే పేరుగాంచిన వీరిలో మార్పు తీసుకువచ్చేందుకు నాస్తిక సమాజానికి చెందిన హేమలత, ఆమె భర్త లవణం తీవ్రంగా ప్రయత్నించారు. వీరి ప్రయత్నాల్లో భాగంగా చేసిన అనేక కార్యక్రమాలతో వారిలో మార్పు వచ్చినట్లు కనిపించింది. మొదట్లో పరివర్తన చెందినప్పటికీ ఆ తర్వాత మళ్లీ అనేక కారణాలతో దొంగతనాలు వైపు నాగేశ్వరరావు ముఠా మళ్ళింది.
-పోలీసుల కాల్పుల్లో మరణం..
తీవ్రమైన నేరాలు, దొంగతనాలు కేసులో నిందితుడుగా ఉన్న టైగర్ నాగేశ్వరరావు తో పాటు ముఠా కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలించేవారు. ఈ క్రమంలోనే 1980లో పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాల్పుల్లో మరణించే నాటికి నాగేశ్వరరావు వయసు 27 ఏళ్లు మాత్రమే. పరివర్తన వచ్చిన తర్వాత దొంగతనాలు వైపు వెళ్లకుండా ఉండి ఉంటే మరణించేవాడు కాదని ఆయన పరిశోధన సాగించిన పరిశోధకులు సుందర్ తెలిపారు. మళ్లీ దొంగతనాలు వైపుకు వెళ్లడం వలన ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. చాలాసార్లు ఆయన మీద కాల్పులు జరిగినప్పటికీ తప్పించుకొని బయటపడగలిగారని సుందర్ వివరించారు. అయితే పోలీసులు అతనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి మూమెంట్స్ తెలుసుకొని కాల్పులు చేయటంతో మరణించారు. కాల్పులు జరపడానికి ముందు ప్రభుత్వం వీరిలో మార్పులు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఈ దిశగా చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
– సమాధి.. ఆర్చ్..
ప్రస్తుతం స్టువర్టుపురం ప్రాంతంలో టైగర్ నాగేశ్వరరావు సమాధి తో పాటు, వీరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన హేమలత, లవణం జ్ఞాపకార్థం ఒక ఆర్చ్ ను నిర్మించారు. ఒకానొక దశలో హేమలత, లవణం దంపతులను తల్లిదండ్రులుగా కూడా నాగేశ్వరరావు ముఠా భావించింది. వారి మాటలు వారు చెప్పిన పనులు చేస్తూ మార్పు దిశగా అడుగులు వేస్తుండగా, మళ్లీ అటువైపు వెళ్లి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సుందర్ తెలిపారు. అయితే ప్రస్తుతం స్టువర్టుపురంలో ఈ తరహా దొంగతనాలకు ఆస్కారం లేదని, ఇక్కడ ప్రజలు యువత విద్యాధికులు కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం యువత ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఇక్కడ నేరాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన స్టువర్టుపురం కథ ఇది. స్టువర్టుపురం హీరోగా పేరుగాంచిన నాగేశ్వరరావు పేరుతో వస్తున్న రవితేజ సినిమా ఏ ఏ అంశాల్ని చూపించబోతుందా అన్న చర్చ ఇప్పుడు సర్వత్ర నడుస్తోంది. ఇక నాగేశ్వరరావు అన్నయ్య ప్రభాకర్ రావు ఎప్పటికీ స్టోర్ ప్రాంతంలో బతికే ఉన్నారు. తన తమ్ముడి గురించి మాట్లాడుతూ ఆయన టైగర్ అనే తమిళనాడు వాళ్లు పేరు ఇచ్చారని, ఆ విధంగా అది స్థిరపడిపోయిందని ఆయన పేర్కొన్నారు. తమ్ముడు దొంగ కాకముందే నేను దొంగను అని, అప్పటికే రెండు ఎకరాల భూమి కొనుక్కున్నట్లు ఆయన వివరించారు. తమ్ముడు వచ్చిన తర్వాత నేను ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదని వివరించారు. టైగర్ నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు అప్పట్లో తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడేవారు.