Huzurabad byelection: ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఉపఎన్నికలకు మార్గం సుగమం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పార్టీల్లో చలనం మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ లు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికపై అంతగా శ్రద్ధ కనబరచడం లేదని తెలుస్తోంది.

అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే దళితబంధు పథకంతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు పథకం వర్తింపజేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సుమారు ఇరవై వేల మంది లబ్ధిదారులను గుర్తించి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో వారి ఓట్లను సాధించాలని తపిస్తోంది. మరోవైపు బీసీ ఓట్లను రాబట్టుకునేందుకు బీసీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించి వారి ఓట్లను కూడా గంప గుత్తగా తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో రసవత్తర రాజకీయం కొనసాగుతోందని తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కూడా ఆకర్షించేందుకు సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్, బీజేపీల్లో నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్ రమణ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కౌశిక్ రెడ్డిని తమ వైపు తిప్పుకుని రాజకీయంగా బలపడాలని భావిస్తోంది. దీంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద్ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించినా ఆరోగ్యం సహకరించకపోవడంతో తన భార్య జమునతో కలిసి నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. డబ్బు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీతో ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో ఏ మేరకు ఆయన ఓట్లు రాబడుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈటల రాజేందర్ రాజీనామాతోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావించినా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఉప ఎన్నికపై ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నిక సజావుగా జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రచారంలో దింపి ఓట్లు రాబట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి.