KCR BRS: రాజకీయ పార్టీ అనగానే దానికి సంబందించిన కార్యవర్గం గుర్తుకు వస్తుంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనూ పార్టీ కార్యవర్గం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన పార్టీకి అధ్యక్షుడే లేడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పే వరకు ఈ విషయం బీఆర్‌ఎస్ నేతలకు కూడా గుర్తుకు రాలేదు. బండి వ్యాఖ్యలతో ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతల్లో మన పార్టీకి అధ్యక్షుడెవరబ్బా అన్న చర్చ మొదలైందట. ఇదిలాం ఉంటే ఎన్నికల సంఘం పార్టీకి ఎలా అనుమతి ఇచ్చిందన్న చర్చ కూడా జరుగుతోంది.

కేసీఆర్‌కు బండి కౌంటర్..
బీఆర్‌ఎస్‌లో ఏపీ నేతల చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ చేసిన ప్రతీ ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు. ‘
బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు లేడు.. సొంతరాష్ట్రంలో అధ్యక్షుడు లేకుండా.. ఏపీకి అధ్యక్షుడా? అని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించింది లేదు.. కానీ పక్క రాష్ట్రంలోని నాయకులను పిలిపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారు’ అని పేర్కొన్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి నంగనాచి లెక్క మాట్లాడడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ పిలిచిన కేసీఆర్ కు సిగ్గు లేకుంటే వచ్చిన వాళ్లకి అయినా ఉండాలి కదా అంటూ విమర్శలు గుప్పించారు. ‘ఆంధ్రా వాళ్లను, ఆంధ్రా బిర్యానీని తిట్టి ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలా.. గత ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును రగిల్చాడని, ఆంధ్ర వాళ్లని తిట్టిపోశాడు అని, ఆంధ్ర బిర్యానీని నానా మాటలు అన్నాడని, ఇప్పుడు అదే ఆంధ్ర బిర్యాని, ఉలవ చారును కేసీఆర్‌కు తినిపించాలి’ అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచి, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానని దేశ ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని అయినా కేసీఆర్‌కి అవేవీ పట్టవని తెలిపారు. తెలంగాణాలో వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుంచి నీరు పంటపొలాలకు చేరితే బోర్లు ఎక్కువగా ఎందుకు వేసుకున్నారో చెప్పాలన్నారు. అసలు తెలంగాణ ప్రాజెక్టును ఏం చేశావని నిలదీశారు. నీటిని వాడుకునే తెలివి కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. ఇక పాఠశాల విద్యలో తెలంగాణ చివరి గ్రేడ్ లో ఉందని ఏమీ అభివృద్ధి చేశారో చూపించాలంటూ ప్రశ్నించారు.
మద్యం అమ్మకాలు.. రైతు ఆత్మహత్యల్లో ముందు..
తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో ముందు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. కేసీఆర్ ఇంకా ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా 2014లోనే ఉన్నాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మద్యం అమ్మకాలలో అభివృద్ధి సాధించిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మద్యం ఆదాయం 10 వేల కోట్ల నుంచి 44 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్ద కుట్ర..
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్ద కుట్ర అంటూ అని బండి మండిపడ్డారు. కేసీఆర్ డీఎన్‌ఏలోనే తేడా ఉందని పేర్కొన్న బండి సంజయ్ భారతదేశంలో భారత బజార్‌లు ఎందుకు ఉంటాయో చెప్పాలన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలలో భారత్ బజార్లు ఉంటాయని తెలంగాణలో తెలంగాణ బజార్లు ఉన్నాయా అని ప్రశినంచారు. ‘నువ్వు తోప్ నాథ్ షిండేవా ? మైసూర్ పాక్ మైసూర్‌లో తయారవుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా? నువ్వు తోప్ నాథ్ షిండే వా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
అధ్యక్షుడిపై బీఆర్‌ఎస్‌లో అంతర్మధనం..
ఇవన్నీ ఇలా ఉంటే.. బీఆర్‌ఎస్ నేతల్లో ఇప్పుడు తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌గా ఉన్న సమయంలో అధ్యక్షుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెససిడెంట్‌గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కేసీఆర్ అధ్యక్షుడనే భావన నేతల్లో ఉన్నా.. జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు అయితే.. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న వస్తుంది. మరి బండి వ్యాఖ్యలతో అయినా పార్టీ కార్యవర్గం ప్రకటిస్తారో లేదు చూడాలి.