ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల జాతకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వారి బాగోతాలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. మహిళలతో వారు మాట్లాడారని చెబుతున్న ఆడియోలు.. జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మొన్ని సినీ నటుడు కమ్ వైసీపీ నేత పృథ్వి, నిన్న అంబటి రాంబాబు, నేడు మంత్రి అవంతి శ్రీనివాస్. వీళ్లు మహిళలతో అసభ్యంగా మాట్లాడారంటున్న ఆడియోలు బయటకు వచ్చాయి. దీంతో.. నేతల రాజకీయ జీవితంపై పెద్ద మరకే పడినట్టయ్యింది. అయితే.. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే అని మాత్రం అనలేకపోయారు ఈ నేతలు. ఆ గొంతు తనది కాదని మంత్రి అవంతి అంటుంటే.. పృథ్వి, అంబటి మాత్రం సొంత వారే కుట్ర పన్నారని అన్నారు. దీంతో.. ఇది ఎవరి పని అనే చర్చ సాగుతోంది.
ఎస్ వీబీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో.. ఒక ఉద్యోగినితో పృథ్వి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆడియో టేపులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నమ్మినవాళ్లే తనను ముంచారంటూ ఆయన అన్నారు. అంటే.. సొంత పార్టీవారే ఇలా చేశారా? అనే చర్చ జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందనే తీరుగా వ్యాఖ్యానించారు. తాజాగా.. అవంతి శ్రీనివాస్ కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు. తన ఎదుగుదలను చూసి ఓర్వకలేకనే కుట్ర చేసినట్టు చెప్పారు.
అంటే.. సొంత పార్టీ నేతలే వీళ్ల ఆడియోలను రికార్డు చేశారా? అనే సందేహాలు కలిగేలా ఉన్నాయి వీరి మాటలు. ఒకవేళ విపక్ష నేతలు ఇలా చేసే అవకాశం ఉందా? అన్నప్పుడు.. అంత సీన్ లేదనే చెప్పుకోవాలి. దేశంలో దుమారం రేపుతున్న పెగాసస్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. విపక్ష నేత రాహుల్ గాంధీతో సహా.. ఇతర ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని, దీనికి కేంద్రమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వ్యవస్థలన్నీ అధికార పార్టీ ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి.. వారు తమ ఫోన్లనే కాపాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఫోన్లను రికార్డు చేసే ఛాన్స్ విపక్షానికి లేదన్నది తేలిపోయే అంశమే. పైగా.. ఈ నేతలు కూడా విపక్షం పేరు చెప్పింది లేదు.
మరి, ఫైనల్ గా ఈ పని చేసింది ఎవరు? అన్నప్పుడు సొంత పార్టీ, ప్రభుత్వం వైపే అనుమానంగా చూస్తున్నారు పలువురు అధికార పార్టీ నేతలు. కారణాలు ఏవైనా ఇలా ఫోన్లు ట్యాప్ చేయడం సరికాదని అంటున్నారు. ఏదో కారణంతో ఒకవేళ ఇలా చేసినా.. ఇలాంటి విషయాల్లో తమను పిలిచి మాట్లాడితే సరిపోతుంది కదా.. అన్నది వారి ఆవేదన. ఇలా రోడ్డున పెట్టి.. రాజకీయ జీవితాన్ని ఇబ్బందుల్లోకి పెట్టడం ఎంత వరకు న్యాయమైందని వాపోతున్నారు. అయితే.. ఇవన్నీ అనుమానాలు, ఆరోపణలే. మరి, వాస్తవం ఏంటన్నది బయటకు వస్తేగానీ తెలియదు.