Yerrannaidu Childrens Park: అదో హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ సొసైటీకి కొంత ఆస్తి మంజూరైంది. అందులో సభ్యులు స్థలాలను పంచుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు. కొంత మొత్తం ఖాళీగా ఉండడంతో సొసైటీ ప్రతినిధులు మరికొందరికి ధారాదత్తం చేశారు. దశాబ్దాల తరువాత దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు గుర్తించి అ స్థలాలు ప్రజోపయోగ పనులకు ఉపయోగించాలని చూశారు. ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పంచాయతీకి ఆ స్థలాలను అప్పగించారు. అందుకే ఎర్రన్నాయుడు మరణానంతరం స్థానికులు ఆయన స్మారకంగా అక్కడ చిన్నారులు సేద తీరేందుకు పార్కును ఏర్పాటు చేయాలని కోరారు.
అప్పటి పంచాయతీ పాలకవర్గంతో పాటు జిల్లా యంత్రాంగం సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో పార్కును నిర్మించింది. అయితే తమకు కేటాయించిన స్థలాన్ని ఎర్రన్నాయుడు తమకు కాకుండా చేశారని..పైగా ఎర్రన్న పేరు పెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీనికి అధికార పార్టీ నేతల సహకారం తోడు కావడంతో అర్ధరాత్రి అందరూ చూస్తుండగానే పార్కు వద్ద విధ్వంసానికి దిగారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎర్రన్నాయుడు స్మారక చిల్డ్రన్స్ పార్కు ధ్వంసం వెనుక నడిచిన కథ ఇది. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. జాతీయ నేతగా ఎదిగినా.. జిల్లాలో ప్రతీ నియోజకవర్గం, ప్రతీ పట్టణం, గ్రామాల్లో సైతం అనుచర వర్గం ఉంది.
కింది స్థాయి కార్యకర్త చెప్పిన సమస్యపై కూడా స్పందించే గుణం ఎర్రన్నది. ఈ నేపథ్యంలో నరసన్నపేట పట్టణంలో ఇందిరానగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూశాయి. 1952లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో హౌస్ బిల్డింగ్ సొసైటీ దరఖాస్తు చేసుకోగా కొంత భూమి మంజూరైంది. వాస్తవ సభ్యులు ఇంటి స్థలాలు మంజూరుకాగా.. చాలావరకూ ఖాళీ స్థలం ఉండిపోయింది. దశాబ్దాల తరువాత ఆ భూమికి తామే వారసులమంటూ 12 మంది 50 సెంట్ల స్థలం ఆక్రమణకు సిద్ధమయ్యారు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. జరిగిన విషయాన్ని అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న ఎర్రన్నాయుడుకు చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ పూర్వపరాలను ఆరా తీశారు. దీనిపై ఒక నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆ స్థలం ప్రభుత్వ భూమిగా నిర్థారించి పంచాయతీకి అప్పగించింది. కానీ ఆ 12 మంది మాత్రం ఆ స్థలాలపై ఆశలు వదులుకోలేదు. అప్పటి నుంచి ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 12 మందికి డిప్యూటీ సీఎం అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడు ఉన్నట్టు తెలుస్తోంది. అది పూర్తిగా ఇందిరానగర్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూమి అని.. రాజకీయ కక్షతోనే అప్పట్లో భూమిని పంచాయతీకి అప్పగించారని వైసీపీ శ్రేణుల వాదన. అదే భూమిలో జిల్లా కలెక్టర్ అనుమతులు, పంచాయతీ అప్రువల్ లేకుండా ఎర్రన్నాయుడు పేరిట పార్కును నిర్మించారని ఆరోపిస్తున్నారు.
ఈ విధ్వంసానికి కారణం టీడీపీ నేతలేనని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న పార్కును తొలగించడంపై మాత్రం అధికార వైసీపీపై విమర్శలు చుట్టుముడుతున్నాయి. కొద్దిరోజుల కిందట నరసన్నపేటలో ట్రాఫిక్ ఐలాండ్ నిర్మాణంలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆక్రమణలు తొలగించారు. అయితే కేవలం పండ్లు, పూలు వ్యాపారాలు చేసుకునే వారి షాపులను తొలగించి.. అధికార పార్టీ నేతల బడా దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే బాధితులు ెవరికి చెప్పుకున్నా వారి మాట వినే నాథుడే కరువయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన ఓ చిరు వ్యాపారి షాపుల తొలగింపునకు కారణమైన అధికార పార్టీ నేతపై దాడికి దిగాడు. కటకటలపాలయ్యాడు. పోలీస్ కేసులు నమోదు కావడంతో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు.