Moinabad Farmhouse: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రలోభపెట్టిందన్న ఆరోపణలు తెలంగాణే కాదు.. దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), పైలట్ రోహిత్‌రెడ్డి(తాండూరు), బీరం హర్షవర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), రేగా కాంతరావు(పినపాక) పార్టీ మారేందుకు సింహయాజి, రామచంద్రభారతి, నందకుమార్ ప్రలోభపెట్టారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లతోపాటు పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపారని.. అడ్వాన్స్ డబ్బులతో మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు వచ్చారని చెబుతోంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. మని ఈ వీడియోల్లో ఎమ్మెల్యేలతో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారి బ్యాంక్ గ్రౌండ్ ఏమిటో చూద్దాం

సింహయాజి…
సింహయాజి.. ఈయన అసలు పేరు అశోక్‌స్వామి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా పడమటికోనలోని అయ్యవారిపల్లి. పదేళ్ల క్రితమే ఆయన స్వగ్రామం విడిచి పెట్టి తిరుపతికి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాలో శ్రీమంత్ర రాజపీఠం నిర్వహిస్తున్నారు. ఎక్కువగా తిరుపతి, హైదరాబాద్‌లో ఉంటారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి సింహయాజి భక్తుడనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరికీ పాత పరిచయాలు కూడా ఉన్నాయని.. తరచూ కలిసేవారని సమాచారం.
రామచంద్రభారతి..
రామచంద్రభారతి.. ఈయన అసలు పేరు సతీశ్‌శర్మ. స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో కపిలాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చారని.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల్లో రామచంద్రభారతిదే కీలకపాత్ర అని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీలోని ఓ అగ్ర నేతతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

నందకుమార్..
నందకుమార్ ఒక వ్యాపారవేత్త. హైదరాబాద్‌లో చైత్యపురిలో నివసిస్తున్నారు. గతంలో ఉస్మాన్‌గంజ్ మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం అంబర్‌పేట నియోజకపరిధిలోని శివంరోడ్డులో ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ పార్టీల సమావేశాలు, సభలకు క్యాటరింగ్ చేస్తారు. ఎమ్మెల్యేలతో స్వామిజీల బేరసారాల్లో నందకుమార్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పోటాపోటీగా ఫొటోల రిలీజ్..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపినట్లు చెబుతున్న ఈ ముగ్గురు గతంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో దిగిన ఫొటోలను టీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. వీరంతా బీజేపీ ఏజెంట్లని.. ఎమ్మెల్యేలను కొనేందుకే ఫామ్‌హౌస్‌కు వచ్చారని ఆరోపిస్తున్నారు. అయితే వారి ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. నందకుమార్‌తో టీఆర్‌ఎస్ నేతలు దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ.. ఎదురుదాడికి దిగుతున్నారు. మునుగోడులో ఓడిపోతామన్న భయంతో.. ఈ డ్రామాను తెరమీదకు తెచ్చారని మండిపడుతున్నారు.
పూజల కోసమే వచ్చారా..
మరోవైపు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో స్వామిజీల చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. తాము పూజలు చేసేందుకే ఫామ్‌హౌస్‌కు వచ్చామని వారు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపేందుకు వచ్చారన్న ఆరోపణలను ఖండిస్తున్నారు. కేవలం పూజల గురించి చర్చిస్తున్నామని.. పోలీసులు ఎందుకు వచ్చారో.. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదని పేర్కొంటున్నారు.