Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే రికార్డ్ స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడం విశేషం. ఈ నెల మూడో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 119 నియోజకవర్గాలకు గాను.. 5,170 నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగిసినా.. గడువులోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్న అభ్యర్థులను అధికారులు అవకాశమిచ్చారు.
ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సామాజిక, ఆర్థికంగా బలమైనఅభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యంత సంపన్నులుగా నిలిచారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 458 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 434 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా… బిజెపిలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి లో భారీగా పోటీ నెలకొంది. గజ్వేల్ లో 152 మంది, కామారెడ్డిలో 64 మంది పోటీకి దిగారు.
నామినేషన్ల ఘట్టం ముగియగా.. 13న నామినేషన్ల స్క్రూట్నీ, 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువిధించారు. 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఈనెల 28 వరకు గడువు ఉండడంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బిజెపిల మధ్య టఫ్ ఫైట్ నడవనుంది. ఎవరికి వారు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వెల్లడైన సర్వేలు విభిన్న ఫలితాలను తెలియజేస్తున్నాయి. దీంతో అందరి దృష్టి తెలంగాణ ఎన్నికలపైనే పడింది.