Ramachandra Bharati – Sunil Bansal: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకు కేసీఆర్ డ్రామాగా ఈ వ్యవహారన్ని బీజేపీ కొట్టిపారేసింది. కానీ శుక్రవారం రెండు ఆడియో టేప్‌లు విడుదల కావడం, అందులో బీజేపీకి చెందిన జాతీయ నేతల పేర్లు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంతో రాష్ట్ర నాయకులతో ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ జాతీయ నాయకులే ఇందులో కీలకంగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేప్‌లో ఎల్–1, ఎల్–2 అంటూ ఇద్దరిని కోడ్ భాషలతో ప్రస్తావించడం, సునీల్ బన్సల్, బీఎల్.సంతోష్ పేర్లు నేరుగా పేర్కొనడం చూస్తుంటే ఈ వ్యవహారమంతా జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బన్సల్ కీలకమా..
ఫామ్‌హౌస్ డీల్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ కీలకంగా వ్యవహరించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల క్రితం ఈయనను తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా అధిష్టానం నియమించింది. గతంలో పశ్చిమబెంగాల్ ఇన్‌చార్జిగా ఉన్నారు. అసెబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బన్సల్ చుక్కలు చూపించారు. దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించినంత పనిచేశారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఓడించారు. కూడా అయితే బీజేపీని అధికారంలోకి తీసుకురాలేదు. పశ్చిమ బెంగాల్‌లో జీరోగా ఉన్న బీజేపీని 90 అసెంబ్లీ సీట్లు సాధించేలా బలోపేతం చేయగలిగారు.
తృణమూల్‌ను చీల్చి…
పశ్చిమ బెంగాల్‌లో గతంలో బీజేపీ ఒకటి, రెండు సీట్లకే పరిమితమయ్యేది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ పశ్చిమబెంగాల్ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ బాధ్యతలు తీసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల నుండి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల వరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల విజయంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాకు సన్నిహితుడిగా, అమిత్ షా వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సమర్థుడిగా బీజేపీలో సునీల్ బన్సల్‌కు గుర్తింపు ఉంది. ఈయన ఎంట్రీతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని దౌడు తీయించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చారు. ఆ పార్టీలో నంబర్ 2 గా ఉన్న మంత్రి సువెందో అధికారిని బీజేపీలోకి తీసుకువచ్చారు. ఆన వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. ఇలా ప్రారంభమైన బీజేపీ దూకుడు ఎన్నికల వరకూ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే బీజేపీ అసెంబ్లీ రేసులో రెండో స్థానానికే పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని మాత్రం ఓడించారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలని..
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా.. ఇందులో భాగంగానే సునీల్ బన్సల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. బూత్ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయడంలో సునీల్ బన్సల్ చక్కటి వ్యూహంతో పనిచేస్తారన్న పేరుంది. పార్టీ బలోపేతానికి ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బయటకు రావడం, ఫోన్ సంభాషణ రికార్డులో ఆయన పేరును రామచంద్ర భారతి ప్రస్తావించడం చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడ అమలు చేయాలని భావిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రామచంద్రభారతి..
మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల్లో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్ర భారతి ఒకరు. ఆయన అసలు పేరు వీకే.సతీశ్‌శర్మ. అయితే.. ఆయన ఎవరు? ఏం చేస్తుంటారు అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా భారతి అనే పేర్లున్న వారు పీఠాధిపతులు. ఆయన ఏ పీఠానికి అధిపతి? అనే వివరాలు ‘గూగుల్’కు కూడా లభ్యం కాలేదు. హరియాణాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న తిల్పాట్ ప్రాంతంలోని గిర్దవార్ ఎన్‌క్లేవ్‌లో ఆయన నివాసం అని తెలుస్తోంది. రామచంద్రభారతి వాట్సాప్ డీపీ ప్రకారం.. ఆయన కేరళకు చెందిన ఓ తాంత్రికుడు అని స్పష్టమవుతోంది. ఆ ఫొటోలో ఉన్న పూజాసామగ్రి సాంతం కేరళీయులు వినియోగించే శైలిలో ఉన్నాయి. ఎదురుగా ఉన్న జ్యోతిలో ‘ఏక వత్తు’ మాత్రమే ఉంది. సాధారణంగా సాత్విక పూజల్లో.. రాజస పూజల్లో రెండు వత్తులతో దీపం వెలిగించాలనేది శాస్త్రం. తాంత్రిక పూజల్లో మాత్రమే ఏక వత్తుతో దీపాన్ని వెలిగిస్తారు. నాలుగు రోజుల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు జరిపిన పూజలోనూ రామచంద్ర భారతి పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు బీజేపీ జాతీయ నాయకులతోనూ సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ కీలక నేత బీఎల్.సంతోష్‌కు రామచంద్రభారతి సన్నిహితుడని పోలీసులు భావిస్తున్నారు. అందే ఆయన మాట్లాడినట్లు చెబుతున్న సంభాషణల్లో సంతోష్‌జీ అని పదే పదే ప్రస్తావించారని తెలుస్తోంది. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవడానికి తనవంతుగా కృషి చేయడానికే ఫామ్‌హౌస్ డీల్‌లో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి స్వామిజీ – ఎమ్మెల్యే సంభాషణ బట్టి చూస్తుంటే ముందస్తు వ్యూహంలో భాగంగా ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో ఎంత వరకు నిజం అన్నది మాత్రం ఇప్పట్లో తెలియడం కష్టం అంటూన్నారు విశ్లేషకులు.