Minister Seethakka: ‘కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా?. కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి.. కాంగ్రెస్ కావాలంటే చేతి గుర్తుకు ఓటేయండి’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నినాదాన్ని బీఆర్‌ఎస్ చాలా ఎక్కువగా వాడుకుంది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, ఉచిత కరెంటు ఎత్తేస్తారని ప్రచారం చేశారు. కానీ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. బీఆర్‌ఎస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలనలో దూకుడుగా ముందుకు సాగుతోంది.
నెల రోజులకే ప్రభుత్వంపై విమర్శలు..
మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కొలువుదీని నెల రోజులు కాకముందే హామీలు అమలు చేయడం లేదని తప్పు పడుతున్నారు. కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచింది అని ఆరోపించారు. ఎన్ని రోజులు ఉందతో చూస్తాం అని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు.
తిప్పికొడుతున్న కాంగ్రెస్..
విపక్ష బీఆర్‌ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పి కొడుతోంది. ఇప్పటికే ఐదు గ్యారంటీల అమలుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆరు నూరైనా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ తెలంగాణను ఎలా దివాళా తీయించింది అనేది స్వేత పత్రాల రూపంలో ప్రజలకు వివరిస్తోంది. పాలన సాగిస్తూనే విపక్ష బీఆర్‌ఎస్ నుంచి వస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కొంటోంది.
సీతక్క ప్రెస్‌మీట్..
కాంగ్రెస్ హామీలను తప్పు పట్టిన కేటీఆర్.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వీటిని తిప్పి కొట్టేందుకు మంత్రి సీతక్క గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని వాటిని వివరిస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో హాల్ మొత్తం అంధకారం అలుముకుంది. దాదాపు 3 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన గాంధీ భవన్ సిబ్బంది వెంటనే మరమ్మతులు చేసి 3 నిమిషాల్లో పునరుద్ధరించారు. ఆ తర్వాత సీతక్క మాట్లాడారు. గాంధీ భవన్‌లో మాత్రమే అంతరాయం కలిగిందని, బయల పోలేదని ఈ సందర్భంగా సీతక్క చెప్పడం గమనార్హం.
గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ జరుగుతుండగా కరెంట్ కట్
ఈ కరెంట్ పోయింది గాంధీ భవన్‌లో బైట కాదు – మంత్రి సీతక్క pic.twitter.com/IfB9uIidaP
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2024