తమిళనాడులో తెలుగోళ్ల ఓటు ఎటు?

తమిళనాడు ఎన్నికలు ఈసారి నువ్వానేనా అన్నట్లుగా సాగేలా ఉన్నాయి. ఈసారి ప్రతీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికలను. అయితే.. ఇక్కడ ఓ ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లు ఎటు పడుతాయా అని ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు కీలకంగా మారారు. జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఒకసారి జయలలితకు, మరోసారి కరుణానిధికి తెలుగు ప్రజలు మద్దతు పలికారు. ఈసారి వారిద్దరూ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో […]

Written By: Srinivas, Updated On : March 19, 2021 10:41 am
Follow us on


తమిళనాడు ఎన్నికలు ఈసారి నువ్వానేనా అన్నట్లుగా సాగేలా ఉన్నాయి. ఈసారి ప్రతీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికలను. అయితే.. ఇక్కడ ఓ ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లు ఎటు పడుతాయా అని ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు కీలకంగా మారారు. జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఒకసారి జయలలితకు, మరోసారి కరుణానిధికి తెలుగు ప్రజలు మద్దతు పలికారు. ఈసారి వారిద్దరూ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలుస్తారనేది సందేహంగా మారింది.

Also Read: కాంగ్రెస్‌ కన్నెర్ర చేస్తే.. ఠాక్రే పరిస్థితి ఏంటి..?

తమిళనాడులో తెలుగు జనాభా ఎక్కువ. చెన్నైతో పాటు ప్రధానమైన పట్టణాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ప్రభావం చూపనున్నారు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకేలు తెలుగు ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ ప్రారంభించాయి. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడులో ఖచ్చితంగా చూపుతాయి. అక్కడ కూడా తెలుగు ప్రజలు తెలుగుదేశం, వైసీపీలుగా చీలిపోయారు. అందుకే.. డీఎంకే, అన్నాడీఎంకేలు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మద్దతు కోరనున్నాయి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధితో కలిసి జగన్ నివాసంలో లంచ్ కూడా చేశారు. ఈ పోస్టర్లను డీఎంకే వినియోగించుకుంటోంది. అలాగే గతేడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు స్టాలిన్ ను కలిసి చర్చించారు. ఈ ఫొటోలను కూడా డీఎంకే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట వాడుతోంది.

Also Read: తప్పు టీడీపీ నేతలదే.. తేల్చేసిన చంద్రబాబు

ఇక.. అధికార అన్నాడీఎంకే పార్టీ సైతం తెలుగు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొన్న బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ కటౌట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉండటం, వైఎస్ జగన్ బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తుండటం, చంద్రబాబు సైతం బీజేపీతో సఖ్యతతో ఉండటంతో తెలుగు ప్రజల్లో అత్యధికులు తమ పక్షాన నిలుస్తారని అన్నాడీఎంకే భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు తెలుగు ప్రజల ఓటు బ్యాంకుపైనే దృష్టి పెట్టినట్లుగా అర్థం అవుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్