Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: తెలంగాణలో సెటిలర్స్ ఎటువైపు?

Telangana Elections 2023: తెలంగాణలో సెటిలర్స్ ఎటువైపు?

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు సెటీలర్స్ కీలకం. పార్టీల గెలుపోటములను నిర్దేశించేది వారే. అందుకే అన్ని పార్టీలు వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. వారి మూలాలు ఉన్న ఏపీ రాజకీయాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఏపీలో రాజకీయ పక్షాలతో ఎటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఏపీని సాకుగా చూపి సెంటిమెంట్ రగిల్చిన తెలంగాణ పార్టీలు.. ఈసారి మాత్రం అదే ఏపీ విషయంలో సానుకూలంగా వ్యవహరించి సెటిలర్స్ ఓట్లు దక్కించుకోవాలని చూడడం విశేషం.

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో సెటిలర్స్ ఓట్లు కీలకం. దాదాపు 50 నియోజకవర్గాల్లో సెటిలర్స్ గెలుపోవటములను నిర్దేశించగలరు. అందుకే వారి అభిమానాన్ని పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్ట్ విషయంలో బిజెపి, కాంగ్రెస్, బి ఆర్ఎస్ లు స్పందించాయి. దీని వెనుక చంద్రబాబుపై అభిమానం కాదు.. ముమ్మాటికీ సెటిలర్స్ ఓట్ల కోసమే. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ తత్వాన్ని ఎగదోశారు. ఈసారి మాత్రం దాని జాడే లేదు. కేవలం అభివృద్ధిని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. సెటిలర్స్ ప్రయోజనాలు కాపాడింది తామేనని చెబుతున్నారు.వారి అభిమానాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే కెసిఆర్ వ్యూహం ఈనాటిది కాదు. సెటిలర్స్ ఓట్లు కీలకమవుతాయని ఆయన ముందే ఊహించారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ప్రాంతీయ సెంటిమెంట్ వర్కౌట్ కాదని భావించారు. అందుకే సెటిలర్స్ ను టార్గెట్ చేసుకొని సంక్షేమ పథకాలను రూపొందించారు. వారి మనసును గెలిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ సైతం తన మేనిఫెస్టోలో సెటిలర్స్ ను టార్గెట్ చేసుకుంది. వారి అభిమానం పొందాలని రకరకాల ఎత్తుగడలు వేసింది. భారతీయ జనతా పార్టీ సైతం అదే వ్యూహంతో ముందుకు సాగింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో సెటిలర్స్ మూలాలు ఉన్న వ్యక్తుల కే అన్ని పార్టీలు టికెట్లు కట్టబెట్టడం విశేషం.

ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సెక్యులర్స్ ఓటు నిర్ణయం తీసుకోవడం గత రెండు ఎన్నికల్లో చూశాం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది. దీని వెనుక సెటిలర్స్ మొగ్గు చూపడమే కారణం. అదే 2018 ఎన్నికలకు వచ్చేసరికి అదే తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలకి పరిమితమైంది. అప్పటికే ఏపీలో వైసిపి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో సెటిలర్స్ వైసిపికి సన్నిహితంగా ఉన్న బి ఆర్ ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు. ఏపీలో భిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూపుతారా అన్నది తెలియడం లేదు. సెటిలర్స్ ఎటువైపు మొగ్గు చూస్తే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరి ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version