ఏపీ రాజకీయాలు మొదటి నుంచి ఎంతో ఆసక్తికరం. ప్రజా ప్రభుత్వం ఓవైపు.. దీటైన ప్రతిపక్షం మరోవైపు.. ఏ సందర్భంలో చూసినా అక్కడి రాజకీయాలు రసవత్తరంగానే నడుస్తుంటాయి. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడూ జగన్ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇప్పుడు టీడీపీ అంతకాకున్నా ప్రతిపక్ష పాత్రనైతే పోషిస్తూనే ఉంది. అయితే.. ఈ ఇద్దరిది ఎప్పటికీ టార్గెట్ సీఎం పీఠమే.
అయితే.. వయసు పరంగా చూస్తే జగన్‌కు ఎంతో రాజకీయ భవిష్యత్ ఉంది. కానీ.. చంద్రబాబుకు వయసు భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు 70 వయసు ఉంది. జగన్ కూడా నెక్ట్స్ టైమ్ తానే సీఎం కావాలని కోరుకుంటున్నాడు. అయితే.. ఈ ఇద్దరి మధ్యన ఇప్పుడు బీజేపీ దూరింది. కొత్త ప్రచారానికి తెరలేపింది. టీడీపీ, వైసీపీలు కుటుంబ పార్టీలంటూ కొత్త రాగం ఎత్తుకుంది. అవినీతికి రెండు పార్టీలూ అచ్చమైన నకళ్ళు అని కూడా అంటోంది.
అంతేకాదు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయనేది వాస్తవం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద ఎంతో కొంత స్పష్టత 2021 ఇవ్వబోతోంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటా విజయ ఢంకా మోగించే పార్టీలకు ఇక ముందు తిరుగు ఉండదన్న భరోసా అయితే ఉంటుంది. మరి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు గాలివాటం అని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూ తమ్ముళ్లను నమ్మిస్తున్న తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అనుకూలం అవుతుందా అన్నది చూడాలి.
మరోవైపు.. మూడు రాజధానుల విషయం కోర్టులో విచారణ దశలో ఉంది. ఎన్నికల నాటికి హై కోర్టు తీర్పు వచ్చినా సుప్రీం తీర్పుకి ఎవరైనా అప్పీల్ కి వెళ్లే చాన్స్ ఉంది. అయితే అన్నింటికంటే ముఖ్యం ప్రజా తీర్పు, జగన్ అంటున్న మూడు రాజధానులు కరెక్టా, చంద్రబాబు చెబుతున్న అద్భుత అమరావతి బెస్టా అన్నది కూడా జనం బ్యాలెట్ పేపర్ ద్వారా నిక్కచ్చిగానే తీర్పు చెబుతారు. లోకల్ బాడీ ఎన్నికలు అంటే 175 నియోజకవర్గాల్లో జనం ఓటు వేస్తారు. స్థానిక సమస్యల మీద ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ పాలన మీద, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల మీద జనం చర్చించి తీర్పు చెప్పే వీలుంది. దాంతో స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని తిరుపతి సీటుని కూడా గత మెజారిటీ తగ్గకుండా వైసీపీ నిలబెట్టుకుంటే ఇక తిరుగు ఉండదని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. 2021 ప్రథమార్థం చూస్తే ఏపీ రాజకీయ ముఖ చిత్రం.. భవిష్యత్ ముఖ చిత్రం అర్థమవుతుందనే చెప్పాలి.