Telangana Elections 2023: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు లక్షలాది మంది నివాసం ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా తెలుగు రాష్ట్రాలు ఉన్న సమయంలోనే బెంగళూరు నగరంతోపాటు కర్ణాటకలో చాలా మంది తెలుగు ప్రజలు ఉండేవాళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండిపోయారు. గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైయ్యింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిద ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు గత శనివారం నుంచి సొంత ఊర్లకు వెళ్లడం మొదలు పెట్టారు. ఎవరి వీలును బట్టి వాళ్లు తెలంగాణకు వెళ్లి వాళ్ల ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు చేరుకున్నారు.
వరుసగా సెలవులు.. హాలిడే ట్రిప్‌గా..
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్బంగా బెంగళూరులోని ఐటీ కంపెనీ ఉద్యోగులకు ఓ ప్లస్ పాయింట్ అయ్యింది. కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమకు నచ్చిన నాయకుడికి ఓటు వెయ్యాలని డిసైడ్ అయ్యారు. బెంగళూరులో ఐటీ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ ప్రజలు బుధవారం సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసి తెలంగాణలోని సొంత ప్రాంతాలకు బయలుదేరారు. గురువారం, శుక్రవారం సెలవు పెడితే శనివారం, ఆదివారం ఎలాగో వీక్లీ ఆఫ్ కనుక నాలుగు రోజుల పాటు సొంత ఊరిలో ఉండటానికి అవకాశం ఉంటుందని, కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడపడానికి అవకాశం ఉంటుందని భావించారు. గురువారం ఓటు వేసి మూడు రోజులు ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి ఆదివారం తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుసుకుని తరువాత మనకు నచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే సంబరాలు చేసుకుని రాత్రి బెంగళూరుకు చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఐదు రోజుల నుంచి బెంగళూరులో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు విడతలవారీగా సొంత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిపోవడంతో బెంగళూరులోని పలు ప్రాంతాలు ఖాళీ అయ్యాయి.